తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనపై ఆరోపణల వర్షం కురిపిస్తూ ఇప్పటికే ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ఆయన తాజాగా స్థానిక ప్రజాప్రతినిధుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు వారికి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితి ఇదంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసని రేవంత్ పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు తెలుసన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారని విమర్శించారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయని అన్నారు. ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్‌లుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో మీ పాత్ర అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు. మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ విజయానికి సహకరించాలని, మీ ఊరి రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని చెప్పారు.
Discussion about this post