అబ్బురపరుస్తున్న వినూత్న ఆవిష్కరణలు
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. మానవాళిని అబ్బురపరిచే విధంగా సరికొత్త ఆవిష్కరణలతో సైంటిస్టులు దూసుకుపోతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ ఆవిష్కరణ ప్రపంచం మెుత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. జపాన్ దేశ ఇంజనీర్లు ఆవు పేడతో అద్భుతం సృష్టించారు. ఆవుపేడతో నడిచే స్పేస్ రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా ప్రయోగించారు.ప్రపంచం మొత్తం వీరి ప్రయోగాన్ని అభినందిస్తోంది.
ఆవు పేడతో చేసిన ఈ ప్రయోగం ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని నిరోధిస్తుంది. అలాగే ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.ఆవు పేడ నుంచి ఉత్పత్తి అయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ కు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ రాకెట్ ప్రయోగం స్పేస్ పరిశోధన రంగంలో అనేక కీలక మలుపులకు నాంది పలకనుంది. మరిన్ని ప్రయోగాలకు తెరతీయనుంది. సాధారణ పరిశోధన రాకెట్లతో పోల్చితే.. ఇలాంటి రాకెట్ల ప్రయోగానికి ఖర్చు తక్కువ అవుతుంది. ఆవుపేడతో జపాన్ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుత ప్రయోగాన్ని జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్‌పోర్ట్ నిర్వహించి చరిత్ర పుటల్లో కెక్కింది.
ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో అంతరిక్షంలోకి మరిన్ని ఉపగ్రహాలు దూసుకుపోయే అవకాశాలున్నాయి. జపాన్ స్థానిక అధికారులు రైతులను సమీకరించి వారి నుంచి ఆవుపేడ ను సేకరిస్తున్నారు. రైతులను ఒక గొడుగు కిందకు తీసుకురావడం అనేది అంతరిక్ష పరిశోధనలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధికి సంకేతంగా నిలుస్తుంది. రైతులు ఈ ప్రాజెక్ట్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. వ్యవసాయ రంగంలో వ్యర్థాల నిర్వహణకు సమగ్ర విధానాన్ని పాటిస్తూ ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా అందుకుంటున్నారు. ఆవు పేడ నుండి వచ్చే బయోగ్యాస్ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ వాతావరణ మార్పులకు కూడా దోహద పడుతుంది.
Discussion about this post