జీవన్ రెడ్డి మాల్ స్వాధీనానికి అధికారుల సన్నాహాలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆర్మూర్ లోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ సంస్థ ఇప్పటి వరకు ఆర్టీసీకి 7.23 కోట్ల రూపాయల మేర స్థలం అద్దె బకాయి చెల్లించాల్సి ఉంది. మరో రూ.2.67 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాల్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు విద్యుత్ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు.
ఆర్టీసీకి చెందిన స్థలంలో మాల్ ఏర్పాటైనప్పటి నుంచి సక్రమంగా అద్దె చెల్లించట్లేదు. దీంతో నవంబరు 11న విష్ణుజిత్ సంస్థకు అర్టీసీ తుది నోటీసు ఇచ్చింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల్లోగా సామాగ్రిని ఖాళీ చేయాలని వస్త్ర, వాణిజ్య దుకాణాల యజమానులకు చెప్పారు. ఈ మేరకు మైక్ లో అనౌన్సమెంట్ కూడా చేశారు. త్వరలోనే మాల్ ను సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన మాల్ అయినప్పటికీ.. అధికారికంగా విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆర్టీసీ నుంచి స్థలం లీజు ఉంది. రూ. కోట్ల బిల్లులు చెల్లించకుండా మాల్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని కొద్ది నెలలుగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖరీదైన స్థలాన్ని తక్కువ ధరకే లీజుకు తీసుకున్నారనే అభియోగాలు ఉన్నాయి.
జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మిస్తామని ఎన్నికలకు ముందు పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వారం రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
Discussion about this post