రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వింత అనుభవం ఎదురైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. లైవ్ కార్యక్రమంలో ఉన్న పుతిన్.., అచ్ఛం తనలాగే ఉన్న వ్యక్తి స్క్రీన్ పై ప్రత్యక్షం అవడంతో అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాస్కోలో తాజాగా జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో నాలుగు గంటల సేపు పాల్గొన్న పుతిన్ కు ఈ అనుభవం ఎదురైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి రెండో పుతిన్ ప్రశ్నించారు. లైవ్ లో తన డబల్ ను చూడగానే రష్యా అధ్యక్షుడు అవాక్కయ్యారు. కొద్ది సేపు మాట్లాడలేకపోయారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించిన పుతిన్ విలేకరుల సమావేశంలో రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు. “నేను సెయింట్ పీటర్ బర్గ్ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని పోలిన వ్యక్తులు చాలామంది ఉన్నారన్నది నిజమేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన జీవితాలకు ఎలాంటి ముప్పు ఉందనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
కృత్రిమ పుతిన్ వేసిన ప్రశ్నపై కొద్దిసేపు మౌనంగా ఉన్న రష్యా అధినేత తర్వాత స్పందించారు. నువ్వు నాలాగే ఉండొచ్చు. నాలాగే మాట్లాడొచ్చు. కానీ, అచ్చం నాలాగే ఉండే వ్యక్తి.. నాలాగే మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు. అది నేనే..” అని చెప్పారు. ఈ సంభాషణకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి.. అచ్చం పుతిన్ ను పోలిన వ్యక్తులు రష్యాలో చాలామంది ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. రష్యా అధ్యక్షుడి అనారోగ్యాన్ని దాచిపెట్టేందుకు.. చాలా బహిరంగ కార్యక్రమాల్లో ఆ నకిలీ పుతిన్ లే పాల్గొంటారనే వదంతులున్నాయి. అయితే, వీటిని క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. తాజా ఘటన ఆ వదంతులను మరోసారి గుర్తు చేసింది.
Discussion about this post