రాష్ట్రంలోని అన్నదాతలకు వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను సిద్ధం చేసింది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రైతు భరోసా’ పథకం పంపిణీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా, అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరాకు 6 వేల రూపాయల చొప్పున నగదు జమ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేసేందుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు చెందిన కోటి 50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకోసం ఆర్థిక శాఖ ఇప్పటికే 9వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసింది.
రాబోయే జులై 15వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ఈ నిధులు పూర్తిగా చేరేలా 10 నుంచి 15 రోజుల స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందించుకుంది. జులై మొదటి రెండు వారాల పాటు బ్యాంకుల్లో రైతుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని స్థానిక బ్యాంకు ప్రతినిధులను ఆర్థిక శాఖ ఆదేశించింది.
రైతు భరోసా నిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పింఛన్ల పంపిణీ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎక్కడా నగదు కొరత రాకుండా చూడాలని, బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ ఆర్‌బీఐ0కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనితో పాటు ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయి ఉన్న వివిధ రకాల ఏరియర్స్ చెల్లింపుల కోసం ప్రతినెలా ఇస్తామని చెప్పిన దాదాపు 2వేల కోట్ల రూపాయలను కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
ఈ బకాయిలను కూడా జులై నెలలోనే పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతోంది. సాధారణంగా వచ్చే నెలవారీ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు అయ్యే 6వేల కోట్ల రూపాయలతో పాటు రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలను కలుపుకొని జులై ఒక్క నెలలోనే దాదాపు 20వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇంతటి భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఆర్‌బీఐ నుంచి సుమారు 11వేల 500 కోట్ల రూపాయల మేర రుణం సేకరించడంతోపాటు రాష్ట్ర సొంత ఆదాయ వనరులను కూడా ఇందుకు తగ్గట్టుగా మళ్లించేందుకు ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోంది.
Follow for more updates
