కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన సప్తనదీ సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో ఓలలాడుతున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగడంతో సంగమేశ్వరం క్షేత్రం కృష్ణా జలాల్లో జలకాలడుతోందా అన్నట్టు సుందర దృశ్యం ఆవిష్కృతమైంది.

ప్రతి ఏటా సంగమేస్వరం వద్ద ఈ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇంతకీ సప్తనదీ సంగమేశ్వరాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
భారత దేశంలోనే 7 నదులు సంగమించే ప్రదేశం సంగమేశ్వరం. అంతే కాదు…. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం సంగమేశ్వరాలయం..వేల సంవత్సరాల చరిత్ర ఉండి …ఎందరో మునులు తపస్సుచేసిన ప్రదేశం సంగమేశ్వరం…కర్నూలు జిల్లాలో నల్లమల ఆటవీక్షేత్రం ఒకవైపు, ఏడు నదులు సంగమించే పవిత్ర ప్రదేశం మరోవైపు…అదే సంగమేశ్వరం క్షేత్రం. భారత దేశంలోనే కాదు….ప్రపంచంలోనే 7 నదులు ఒకచోట కలిసే ప్రదేశం ఎక్కడా లేదు….కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద తుంగ, భద్ర, కృష్ణా, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు సంగమించే ప్రదేశమే సంగమేశ్వరం.
ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుష నది, మిగిలినవన్నీ స్త్రీ నదులు. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి. సంగమేశ్వరాలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. తెలంగాణా ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు.
సంగమేశ్వరాయలం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల కాలంలో గాయత్రీ దేవి గోమాత పాదముద్రలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. క్రిష్ణా నదికి ఒకవైపు తెలంగాణా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణలో సోమేశ్వరం, ఏపీలో సిద్ధేశ్వరం కృష్ణా నదికి రెండువైపులా ఉంటాయి. సిద్దేశ్వరానికి, సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రిదేవి పాద ముద్రలు ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి గాయత్రి దేవి కోసం సుదీర్ఘ తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రి దేవి ప్రత్యక్షమైందట. అ సందర్భంలో రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయట. ఇప్పటికీ అక్కడ విశ్వామిత్ర తపస్సు చేసిన గుహ కూడా ఉంది.
Follow for more updates
