ప్రభుత్వ పాఠశాల పేరెత్తితే చాలు అక్కడ తమ పిల్లల్ని చదవించడం అంటే చాలా మంది చిన్నతనంగా భావిస్తారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రైవేటు స్కూళ్లవైపే చూస్తున్నారు. కానీ ప్రభుత్వ బడికి మాత్రం పంపడం లేదు. ఇలాంటి వారిలో పేద, ధనికులన్న తేడా కూడా లేదు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తాను చదువు చెబుతున్న పాఠశాలలోనే తన కొడుకును కూడా చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
పాఠశాల గేటు దాటి బైకుపై వస్తున్న ఈ తండ్రీ కొడుకులు… బైకును అక్కడ పార్కు చేసి నడుచుకుంటూ తరగతి గదివైపు వెళుతున్నారు. ఈ సందర్భాన్ని చూసిన ఎవరైనా కూడా తన కొడుకును పాఠశాలలో దింపేందుకు వచ్చిన తండ్రి అని భావిస్తారు. వారిద్దరూ తండ్రీ కొడుకులన్న మాట వరకు నిజమే. కానీ తన కొడుకును పాఠశాలలో దింపేందుకు వచ్చిన తండ్రిగా మాత్రం అక్కడికి రాలేదాయన. ఆయన కూడా ఆ పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. అందుకనే తండ్రీ కొడుకులిద్దరూ కలిసి వచ్చారు.
ఇదే ఆ తండ్రీ కొడుకులిద్దరూ వచ్చిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఉంది. బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామానికి చెందిన దాసర్ల రాజన్న ఉయ్యాలవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నారు. అక్కడి పాఠశాలలో పిల్లలకు చక్కగా పాఠాలు చెబుతున్నారు. సాదాసీదా జీవనం గడిపే రాజన్నకు ప్రభుత్వ విద్యపై మమకారం ఎక్కువ. తాను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ విద్య అంటే రాజన్నకు మమకారం మాత్రమే కాదు… ఒక ధృఢమైన నమ్మకం కూడా. అందుకనే తన కొడుకును కూడా అదే పాఠశాలలో చదివిస్తున్నారాయన.
అక్కడి పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు వస్తోన్న రాజన్నతో కలిసి వస్తోన్న రాజన్న కొడుకు రాంచంద్రు అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి చక్కగా చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడిలో చదవడం తనకు సంతోషంగా ఉందని చెబుతున్నాడు ఆ బాలుడు. తోటి విద్యార్థులు, అక్కడి ఉపాధ్యాయులు అందరూ తనతో కలిసిమెలిసి ఉంటారని చెప్పాడు. తన తండ్రి ఒక్కోసారి సెలవు పెట్టినప్పటికీ తాను మాత్రం బడికి వస్తానని చెబుతూ ప్రభుత్వ బడిపై తన నిబద్ధత చాటాడు ఆ చిన్నారి.
తాను చదువు చెబుతున్న ప్రభుత్వ పాఠశాలలోనే తన కొడుకును కూడా చేర్పించడం ద్వారా ఉపాధ్యాయుడు దాసర్ల రాజన్న సమాజానికి ఒక చక్కటి సందేశం పంపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యపై ఫోకస్ పెట్టినట్లు చెబుతోంది . ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజన్న తన కొడుకును అక్కడ చదివించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ఉన్న నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉపాధ్యాయులకు మీరిచ్చే సలహా ఏమిటని అడిగినప్పుడు రాజన్న ఇచ్చిన సమాధానం కూడా ఎదుటి వారిని గౌరవించే విధంగానే ఉంది.
ప్రభుత్వ విద్యపై నమ్మకం లేక కొంత మంది… సమాజంలో చిన్నచూపు ఉంటుందన్న అపోహతో మరికొంత మంది తల్లిదండ్రులు… ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తమ కష్టార్జితమంతా పిల్లల చదువుల కోసమే వెచ్చిస్తున్న నేటి తరుణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసర్ల రాజన్న లాంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిజంగా ఆదర్శవంతుడే. అందుకే నలుగురికి ఆదర్శంగా ఉండే నిర్ణయం తీసుకున్న రాజన్నను అభినందించకుండా ఉండలేక పోయింది ఫోర్ సైడ్స్ టీవీ. నిబద్ధతతో ప్రభుత్వ విద్య కోసం తాపత్రయ పడుతున్న రాజన్నను ఫోర్ సైడ్స్ టీవీ బృందం సన్మానించింది. ఇదీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసర్ల రాజన్న సింప్లిసిటీ.
Discussion about this post