1641లో ఓ వాణిజ్య నౌక 42 వేల కోట్ల నిధితో బ్రిటన్ సముద్రతీరానికి కొంత దూరంలో నీట మునిగింది. జలసమాధి అయిన ఆ నౌక జాడ కోసం ఆ తరువాత ఎందరో ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. తాజాగా… ఆధునిక టెక్నాలజీతో నావ జాడ కనిపెడతామంటూ ఓ కంపెనీ తాజాగా ముందుకొచ్చింది.
అపార నిధినిక్షేపాలున్న ఈ నౌకను అప్పట్లో సముద్రపు ఎల్ డొరాడో అని పిలిచేవారు. బ్రిటన్‌లోని కార్న్‌వాల్ తీరం సమీపంలో అది నీట మునిగింది. అందులో సుమారు 42 వేల కోట్ల విలువైన వెండి, బంగారాలు దాగున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా ఎందరో ఆ నౌక ఆచూకీ కోసం ప్రయత్నించినా… విఫలమయ్యారు. తాజాగా మల్టీబీమ్ సర్వసెస్ అనే సంస్థ నిధి వేటకు రంగంలోకి దిగింది. సముద్రంలో కూలిపోయిన నౌక జాడను కనిపెట్టడంలో మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థకు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతమున్న ఆధునిక టెక్నాలజీతో ఆ నిధి జాడ కనుక్కోవడం సాధ్యమని సంస్థ బలంగా విశ్వసిస్తోంది. సముద్రం అడుగున 200 చదరపు మైళ్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం అత్యాధునిక మానవరహిత వెసెల్స్, సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్రగర్భాన్ని జల్లెడ పడుతుంది. ఈ ఏడాది మొత్తం గాలింపు చర్యలు ఉంటాయని సంస్థ చెప్పింది.
ఇది నిధుల వేట కాదని మల్టీబీమ్ సర్వీసెస్‌కు నేతృత్వం వహిస్తున్న నైజెల్ హాడ్జ్ చెప్పారు. ఇది చారిత్రక సంపద అని, దానికున్న విలువ అపారమని అన్నాడు. ఆ నిధిని వారసత్వ సంపదగా భావిస్తామని, సముద్రంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతంలో ఎల్ డొరాడో కూలిపోయిందని, కాబట్టి అక్కడ గాలింపు చర్యలు ఓ సవాలని అన్నారు. ఆ ప్రాంతంలో వేలకొద్దీ నౌకలు మునిగిపోయాయి. వాటి అవవేషాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటిల్లోంచి ఎల్ డొరాడో ఎక్కడ ఉందో గుర్తించి వెలికి తీయాల్సి ఉంటుంది. ఇది సులభమైన పని అయ్యుంటే ఈపాటికే దాన్ని ఎవరోఒకరు వెలికి తీసి ఉండేవారు అని అన్నారు. నావ కూలిన ప్రాంతం తమకు బాగా తెలుసునని, ఆధునిక టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి విజయం తథ్యమని చెప్పారు.
Discussion about this post