బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన సీతమ్మ సాగర్ పనులు పూర్తికాక అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విలువైన భూములను కోల్పోయిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. నలుగురికి అన్నంపెట్టే రైతులు దేహి అనే దుస్తితి నెలకొంది. అప్పటి ప్రభుత్వం చౌకగా భూములను లాక్కుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా తమ గోడు వింటుందా? తమకు ఇప్పటికైనా సరైన న్యాయం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రన్ ఆఫ్ రివర్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ తో గోదావరి నదిపై సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. 150 ఏళ్ళ కిందట నిర్మించిన దుమ్ముగూడెం ఎత్తిపోతల పధకానికి దిగువన ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారు. గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామం, దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్లపల్లి గ్రామం మధ్య సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ ఆనకట్ట 63 అడుగుల ఎత్తు పెంచుతూ…37 టీఎంసీల సామర్ధ్యంతో నీరు నిలువ ఉండేలా డిజైన్ చేశారు. 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ కేంద్రాన్ని కూడా తెలంగాణ సర్కార్ నిర్మించాలని యోచించింది.
సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 1,333 మీటర్లు… ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చర్ల నాలుగు మండలాల్లో కలిపి సుమారు 35 గ్రామాల ప్రజలు తమ భూములను కోల్పోయారు. 67 గేట్లతో, సుమారు 3,482 కోట్ల బడ్జెట్ తో… గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ & టీ సంస్థతో 2,711 కోట్లకు ప్రాజెక్ట్ నిర్మాణ టెండర్లను కేటాయించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 26 అక్టోబర్ 2022 శంకుస్థాపన జరగగా…డిసెంబర్ 2023 వరకు పనులను పూర్తి చెయ్యాలని L&T సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులు 40 శాతం పెండింగులో ఉండగానే అనుమతులు లేవని నిలిపివేయడంతో తీవ్రజాప్యం జరిగింది. ఇప్పటికే భూములను కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగలేదని… పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చెల్లించకపోవడంతో ఆందోళన బాటబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది.
Discussion about this post