కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ల ఎంపిక నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే రిటైర్ అవడం, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు.
మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఈసీల నియామకం వేగంగా జరుగుతోంది. మరోవైపు.. కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడగా…. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉన్నారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Discussion about this post