చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ చందమామను చూపిస్తూ మనకు అమ్మ అన్నం పెట్టేది. ఆకాశంలో చిన్న చిన్న నక్షత్రాల మధ్య పెద్దగా వెలుగుతూ కనిపిస్తే మనకు చాలా అద్భుతంగా ఉండేది కదూ.. దానిని చూస్తూ.. ఆశ్చర్యంగా మనం నోరు తెరిస్తే.. టక్కున అమ్మ అన్నం పెట్టేది.. ఆటోమేటిక్ గా మనం గిన్నె ఖాళీ చేసేవాళ్లం.. అలా చిన్నప్పటి నుంచి మనకు జాబిల్లి అంటే లెక్కలేనంత ఇష్టం.. పెద్దవాళ్లం అయ్యాక అసలక్కడ ఇల్లు కడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు రావడం కామన్ కదా.. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.
అమెరికా అర్థదశాబ్దం తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుష్యులను పంపాలని ప్రణాళికలు వేస్తోంది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్‌లు నాసా ద్వారా 1969లో చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపారు. భారత్, రష్యా, చైనా, జపాన్‌లు అంతరిక్ష నౌకలను, ల్యాండర్లు, రోవర్లను చంద్రుని ఉపరితలంపైకి పంపించాయి. కానీ… మనుషులను పంపలేదు. ప్రస్తుతం ‘ఆర్టెమిస్’ ప్రొగ్రామ్ లో చంద్రునిపైకి మనుషులను పంపాలని అమెరికా మళ్లీ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర గ్రహాలపై నివాస స్థావరాలను ఏర్పాటు చేయడం కంటే ముందు చంద్రునిపై మనుషులను కొద్ది కాలం పాటు ఉంచడం ద్వారా ప్రయోజనాలు చేకూరతాయా.. ? అనేది పరిశీలిస్తున్నారు.
చంద్రుని దక్షిణ ధ్రువానికి 600 కి.మీల దూరంలో భారత్ చంద్రయాన్ 3 మిషన్ ల్యాండ్ అయ్యింది. ఇనుము, టైటానియంతో పాటు సల్ఫర్, అల్యూమినియం, ఇతర ఉపయోగకరమైన మూలకాలున్నట్లు ఇది నిర్ధారించింది. కానీ, మంచు నీరు ఉన్నట్లు మాత్రం ఇది ధ్రువీకరించలేకపోయింది. జపాన్‌తో కలిసి భారత్ మళ్లీ చంద్రునిపైకి తన అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగంలో చంద్రునిపై మంచు- నీరును గుర్తించాలని చూస్తోంది. చంద్రునిపై మానవ నివాసాలు ఏర్పాటు చేసేందుకు మంచు- నీరు చాలా అవసరం. ఎందుకంటే, ఆక్సిజన్ దాని నుంచే తయారవుతుంది కాబట్టి.
అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ టెక్నాలజీ చాలా ముఖ్యం. దీని కోసం అత్యంత శక్తిమంతమైన రాకెట్ కావాలి. అంగారక గ్రహంపైకి చేరుకోవడానికి 6 నుంచి 8 నెలలు పడితే, చంద్రుడిపైకి వెళ్లేందుకు మూడు రోజులే పడుతుంది. అయితే అతి పెద్ద సాంకేతిక సవాళ్లు ఏవంటే…. రాకెట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలి. రేడియేషన్ నుంచి వ్యోమగాములను రక్షించాలి. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ చేయాలి… చంద్రునిపైన లాంచ్ చేసిన రాకెట్‌ను తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలి.
Discussion about this post