టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ? | Shreyas Iyer as New India’s T20 Captain ?

భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం ఇటీవలే జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం శ్రేయస్ అయ్యర్ రేపు జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొననున్నాడు. ఈ సమావేశంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా కప్ కోసం భారత జట్లను ఎంపిక చేయనున్నారు.

2023 డిసెంబరులో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన మ్యాచ్ తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ ఆడని అయ్యర్.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శనతో మళ్లీ జాతీయ జట్టులోకి రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సీజన్‌లో 498 పరుగులు చేసి తన బ్యాటింగ్ సత్తాను నిరూపించాడు. అంతేకాదు కెప్టెన్సీలో కూడా ఆకట్టుకున్నాడు. టీమిండియా తదుపరి టీ20 సవాల్ ఐర్లాండ్ పర్యటనతో ప్రారంభం కానుంది. జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్..

అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లలోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. మరోవైపు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు కీలక బాధ్యతలు దక్కే అవకాశముంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ సభ్యులు మనోడిని టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. యువ ఆటగాడిగా తిలక్ గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టును విజయవంతంగా నడిపించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే, టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో అతడి వ్యక్తిగత బ్యాటింగ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026లో కూడా సూర్య నిరాశపరిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి పేలవ ఫామ్ కారణంగా ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ]ఈ నేపథ్యంలోనే టీ20 ప్రపంచ కప్ 2028, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును నిర్మించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పులపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రేపు జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశం అనంతరం టీ20 జట్టు నాయకత్వంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top