వావ్.. ఇన్నాళ్లకు తన డ్రీమ్ తీరిందనుకుని సంబరపడిన ఆ పోలీస్ ఎస్సైకి .. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తాను చేయకూడని పని చేసి అధికారులకు అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయ్యాడు. ఆన్ లైన్ బెట్టింగ్ జరగకుండా చూడాల్సిన ఆయనే స్వయంగా బెట్టింగ్ లో పాల్గొని కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నత అధికారులు సస్పెన్షన్ ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు.
పూణేలో ఎస్సైగా పనిచేస్తున్న సోమనాథ్ ఝేండే రెండు మూడు నెలలుగా ఆన్ లైన్ బెట్టింగ్ వేదిక డ్రీమ్ 11 లో బెట్టింగ్ లు కాస్తున్నాడు. ఇటీవల ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. ఈ విషయమై యూనిఫామ్ ధరించి మరీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసాడు. దీంతో ఈ వార్త వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు. డీఎస్పీ స్వప్న గోరె విచారణ జరిపి నివేదిక సమర్పించాక సోమనాథ్ ఝేండేను సస్పెండ్ చేసారు.
ఆన్ లైన్ బెట్టింగ్ వేదిక డ్రీమ్ 11 వివిధ క్రీడలకు సంబంధించి ఫాంటసీ పోటీలపై ఆన్ లైన్ లో బెట్టింగులు నిర్వహిస్తుంటుంది. ఇటీవల బంగ్లాదేశ్. ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి డ్రీమ్11 జట్టును సోమనాథ్ ఝేండే ఎంపిక చేసాడు. ఇందులో అతడు విజయం సాధించి కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు.
Discussion about this post