సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్ర నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు. కాగా ఈ గిరి ప్రదక్షణ సాయంత్రం పుష్పరథంతో ప్రారంభం కానుంది. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు పుష్ప రథాన్ని ప్రారంభించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సిబ్బంది అన్ని సౌకర్యాలు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం అయ్యింది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. సింహాచల అప్పన్నకు నాల్గో విడత చందన సమర్పణ వేళ గిరి ప్రదక్షిణ చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రసాద్ పరిశీలించారు.
సింహాచల గిరి ప్రదక్షిణకు 8 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాదికోసారి ఆషాడ పౌర్ణమి రోజున సింహాచల గిరి ప్రదక్షిణ జరుగుతుంది. తొలి పావంచా నుంచి అడవివరం , హనుమంత వాక , అప్పుఘర్ , ఇసుకతోట, సీతమ్మధార, నరసింహానగర్, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తొలి మెట్టు వరకు గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
Discussion about this post