వేల ఏళ్ల క్రితమే ఈజిప్టులో మెదడు కణితి కేన్సర్ కు చికిత్స జరిగిన ఆనవాళ్లను గుర్తించినట్లు ఒక అధ్యయనం తెలిపింది. దీనిని ఫ్రాంటీయర్స్ ఇన్ మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. 4,600 ఏళ్ల క్రిందటి ఈజిప్షియన్లకు ఈ సర్జరీ జరిగినట్లు , మైక్రోస్కోప్ లను ఉపయోగించి తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో పురాతన ఈజిప్షియన్ వైద్యం, అప్పటి కేన్సర్ ట్రీట్ మెంట్ గురించి మరింతగా అధ్యయనం చేసేందుకు దోహదపడుతోంది.
మమ్మీల నుంచి అస్థిపంజరాల అవశేషాలు, ప్రాచీన ప్రతుల నుంచి, లేదా అప్పటి పుస్తకాల నుంచి లేదా శవాలపై విశ్లేషణలు జరపడం ద్వారా రోగాలను తెలుసుకోవడాన్నే పాలియో పేథాలజీ అంటారు. స్పెయిన్ కు చెందిన పాలియో పేథాలజిస్ట్ శాంటియాగో డి కంపోస్టేలా ఈ విషయాన్ని బహిర్గతం చేశారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ప్రాచీన ఈజిప్టీయులకు మానవ శరీర నిర్మాణం దానిలోని నొప్పులు గురించి తెలుసు. 3100 బీసీ కిందటే ఫరో నాగరికతలో నీటి మొక్క నుంచి తయారు చేసిన పేపర్ వంటి పాపిరి పై హైరోగ్లిఫ్ అనే చిత్రలిపి ద్వారా మందుల పేర్లు రచించారు. ఈ హైరోగ్లిఫ్ ల ప్రకారం ఎముక గాయంతో సహా, నిర్థిష్ట వ్యాధులు, బాధాకరమైన గాయాలు వర్గీకరించి వివరించారు. దీని ప్రకారం చూస్తే ఈజిప్షియన్ వైద్యం తగినంతగా అభివృద్ది చెందినట్లుగా అధ్యయనం తెలిపింది. డాక్టర్ ఖలీద్ ఎల్సయాద్ ప్రకారం ప్రత్యేక వైద్యులు పేషంట్ల చరిత్రను తీసుకొని పరీక్షించేవారు. వ్యాధిని నిర్థారించడానికి మాన్యువల్ గా క్లినికల్ టెస్టు చేసి ఫలితాలను చెప్పేవారని తెలుస్తోంది. అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా జరిపేవారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
పూర్వకాల ఈజిప్షియన్లు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తినవలసిన పదార్థాలు, ఆహార అలవాట్లపై మంచి అవగాహన కలిగి ఉండేవారని డాక్టర్ ఖలీద్ తెలిపారు. దేహ దారుఢ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం, క్రీడలు, వ్యక్తిగత పరిశుభ్రం, రోజూ శరీరాన్ని శుభ్రం చేసుకోవడంతోపాటు, దంతధావనం కూడా చేసేవారని ఆయన తెలిపారు. అప్పట్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేదని అందులో కేన్సర్ ను గుర్తించడం, చికిత్స అందిందని ఆయన అన్నారు. ‘ఎడ్విన్ స్మిత్ పాపిరస్’ గ్రంధం దాదాపు 3,600 సంవత్సరాల క్రితం నాటి ప్రపంచంలోని పురాతన వైద్య శస్త్ర చికిత్స గ్రంథంగా పరిగణించబడుతోంది. చాలా మంది పరిశోధకులు కేన్సర్ ను “ఒక తీవ్రమైన వ్యాధి” అని .. దీనికి “చికిత్స లేదు.” అని కూడా తెలిపినట్లు ఖలీద్ చెప్పారు. అయినప్పటికీ, పురాతన ఈజిప్షియన్లు ఈ వ్యాధికి చికిత్స చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని తాజా ఆవిష్కరణ సూచిస్తుంది. కపాలంపై ఉన్న గాట్ల ద్వారా బ్రెయిన్ కేన్సర్ ఆపరేషన్ గా దీనిని గుర్తించారు.
Discussion about this post