దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్లలో 17 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్ర జల కమిషన్ తెలిపింది. దక్షిణాన దాని నిర్వహణలో ఉన్న 42 రిజర్వాయర్ల లో గరిష్టంగా 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ప్రస్తుత నివేదిక ప్రకారం కేవలం 8.865 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే 17 శాతం మాత్రమే నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 29 శాతం ఉండగా, పదేశ్ల కనిష్టానికి నీటి నిల్వలు తగ్గాయి. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగు నీటి సమస్యతోపాటు జల విద్యుత్ కూడా కుంటుపడింది. ఈశాన్య రాష్ట్రమైన అసోం, తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమబెంగాల్లో వాటర్ స్టోరేజ్ లెవల్స్ గతేడాదికంటే పెరిగాయి. అక్కడి కేంద్ర జల కమిటీ నిర్వహణలోని 23 రిజర్వాయర్ల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం కాగ, ప్రస్తుతం అక్కడ 7.889 బీసీఎం అనగా 39 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 34 శాతం నీటి నిల్వలు అదనంగా పదేళ్ల గరిష్టంలో ఉన్నాయి.
పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్ , మహారాష్ట్రాల్లో కేంద్ర జలవనరుల సారధ్యంలోని 49 రిజర్వాయర్లలో నీటి నిల్వలు 11.771 బీసీఎం అనగా 31.7 శాతం ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో 38 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. ఉత్తర, మధ్య భారతాలలో కూడా రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. బ్రహ్మపుత్ర, నర్మద, తాపి నదీ పరివాహక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ నీటి నిల్వలు ఉండగా, కావేరీ, తూర్పు ప్రాంతంలోని మహానంది, పెన్నార్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు కనిష్టానికి చేరుకున్నాయి.
Discussion about this post