బైబిల్ అంతా ‘నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు’లో నిక్షిప్తమై ఉంది. తన ప్రజల కోసం లేదా బిడ్డల కోసం ప్రాణమిచ్చే ప్రేమకు సంకేతంగా ఏసు ప్రభుని గుర్తించవచ్చు. ఈ భూగోళంపై అనంతమైన ప్రేమకు సంకేతంగా కరుణామయుడైన క్రీస్తు నిలుస్తారు. రాజ్యాలు, రాజ్య భోగాలు కోసం కాకుండా.. పేదలు, అణగారిన, ఆక్రందనలు చేస్తున్న వారి కోసం వచ్చానన్నారు. ఆయన స్వరూపం, బోధనలు, జీవిత విధానం విప్లవాత్మకమైనది మాత్రమే కాదు. రాజకీయ పరిణామాలను కూడా కలిగి ఉంది.
ప్రేమ, దయతో వివేకవంతంగా జీవించాలని ఆయన కోరుతున్నారు. ఆయన జీవితంలో అతి క్లిష్టమైన పరిస్థితిని సిలువపై చవిచూశాడు. అంతటి వేదనాకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రేమామయమైన మాటలే ప్రపంచ గమనాన్ని మార్చింది. చరిత్రకారుల ప్రకారం, అన్ని మరణాలలో కెల్లా శిలువపైన మరణం భాధాకరమైనది. ఈ శిక్ష విధించిన వారిని ప్రత్యేకముగా తాయారు చేసిన ఒక కొరడాతో కొడతారు. ఈ కొరడా తయారు చేయడానికి పదునైన గొర్రె ఎముకలు, లోహాలు ఉపయోగించేవారు. అవి లోతుగా గుచ్చుకుని, చర్మాన్ని రక్తముతో తొలిచేసేది. అటువంటి భాధలో, హింసలో వున్న వారితోనే శిలువను కూడా మోయిస్తారు. ఏసుక్రీస్తు మోసిన ఆ శిలువ బరువు సుమారు 50 కిలోలు ఉండొచ్చు.
దోషులని ఆ సిలువపై పెట్టి వారి చేతులకు, కాళ్లకు మేకులు కొడతారు. ఆ మేకులు కూడా రక్తము ఎక్కువ పోకుండా నరాలు తెగిపోకుండా కొడతారు. ఇలా చేస్తే ఎక్కువ సమయం చనిపోకుండా తీవ్రబాధను అనుభవిస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఊపిరి తీసుకోవాడికి చాలా కష్టం. ఇటువంటి భయంకర శిక్షను యేసు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన పలికిన ఏడు మాటలు ఎంతో ప్రశస్తమైనవి.
యేసు క్రీస్తు ప్రభువు సిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలు ఎంతో ముఖ్యమైనవి. ఈ మాటలు ఆయన జీవితానికి, ఆయన ఇచ్చిన సందేశానికి, మనయందు ఆయనకి ఉన్న ప్రేమకు నిదర్శనాలు.
1.తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
ఒకవైపు కఠిన మనస్సుగల రోమాసైనికలు టార్చర్ పెడుతుండగా, ఆ కఠిన మనస్కులను వీళ్లేమి చేస్తున్నారో వీరికి తెలియదు.. క్షమించు అనడం ఎవరికైనా సాధ్యమేనా ?
2. నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు
ఏసు క్రీస్తుతో పాటు కుడి వైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా శిలువ వేశారు. అందులో ఒకడు నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ని నువ్వు రక్షించుకొని మమ్ములను రక్షించు అని హేళన చేయగా, కుడివైపు ఉన్న దొంగ మాత్రం నువ్వు..నేను ఈ శిక్షకు పాత్రులం. ఆయనలో ఏ దోషం లేదు.. అని చెప్పి ప్రభువు వైపు తిరిగి నీరాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ‘ నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు అని ఏసు చెప్పారు. అంటే నువ్వు నాతోపాటు పరలోకంలో ఉంటావు అని అర్థం.
3. అమ్మా, యిదిగో నీ కుమారుడు
ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,ఆ శిలువపై కఠిన వేధన పొందుతూ కూడా , యేసు ఆయన తల్లిని చూసారు. అప్పుడు ఆమెను పిలిచి, “అమ్మా,యిదిగో నీ కుమారుడు” అని తన తల్లితో చెప్పెను, తర్వాత శిష్యుని చూచి “యిదిగో నీ తల్లి” అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తల్లిగా భావించి ఇంటికి తీసుకెళ్లాడు. ఈ మాటలో యేసు మనకు తల్లిదండ్రుల భాద్యతలు ఎలా నిర్వర్తించాలో నేర్పిస్తున్నారు. ముఖ్యముగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెబుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులను చూసుకోవడానికి ఏవో సాకులు చెబుతుంటారు. అయితే ఏసుక్రీస్తు మాత్రం మహావేదనతో మరణించేముందు కూడా ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి, తన శిష్యుడై యోహానుకి తల్లి భాధ్యత అప్పగించారు.
4. నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి..
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. వాస్తవానికి భరించలేని బాధలు పడాల్సి వచ్చినప్పుడు చనిపోతే బాగుండు అను కుంటాం. అయితే క్రీస్తు మాత్రం తండ్రీ నువ్వు ఎందుకు నన్ను విడిచి పెడుతున్నావ్ అని దీనంగా అడుగుతున్నారు. ఇంతకీ ఏసు ఈ బాధలు ఎవరికోసం పడుతున్నారో తెలుసా ? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా సాటి మనుషులకు మనం చేసిన అపకారాలు, అపచారాలు, ద్రోహాలకు ప్రాయశ్చిత్తంగా ఆ పాపాలన్నీ ఆయనపై వేసుకుని కఠిన బాధలు పొందారు.
5. నేను దప్పిగొను చున్నాననెను
అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు తెలుసుకొని, బైబిల్ వాక్యము నెరవేరునట్లు నేను దప్పిగొను చున్నాననెను. ఆయన దప్పిక ఏమంటే మనం అంతా మన పొరుగువారికి మంచి చేయాలని, విశ్వప్రేమను పంచాలని ఆయన ఉద్దేశ్యం. అయితే అందుకు వ్యతిరేకంగా హింసాత్మక ధోరణిని అలవరచుకోవడం ఆయన దాహానికి కారణం అయ్యింది. అప్పుడు ఏసుక్రీస్తుకు రోమా సైనికులు చేదును కలిపిన ద్రాక్షారసంగల చిరకను ఇచ్చారు. అది తాగితే ఆయన తన శారీరక బాధలను మరచి పోవచ్చు. అంటే సారాయి వంటి పదార్థం అన్న మాట. అయితే ఏసు దానిని తిరస్కరించారు.
6. సమాప్తమైనది
యేసు ఆ చిరకను తిరస్కరించి ‘సమాప్తమైనదని’ చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటతో యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశ్యము నెరవేరినది. మనం ఏదైన పొరుగువారిది పగలగొట్టడం, పాడు చేయడం వంటిది చేశామనుకుంటే వారి ఆగ్రహం నుంచి మన పిల్లలను రక్షించుకోవాలంటే అందుకు తగిన విలువను మనం సమర్పించుతాం..ఇది కూడా అంతే .. మనం అసూయ, అక్కసు, ద్వేషంతో చేసిన పనులకు ఆయన మూల్యాన్ని సమర్పించారు. అందుకే ఆయన సమాప్త మైంది అని చెప్పారు.
7.తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. వాస్తవానికి యూదుల పిల్లలు ఇప్పుడు కూడా రాత్రి పడుకునే ముందు దేవునికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెబుతారు. మరొక అర్థంలో దేవుడు తన జీవాత్మను మనందరిలో ఊది మనల సృష్టించాడు కాబట్టి ఆయన ఆత్మను మళ్లీ ఆయనకు అప్పగించడం అన్నమాట.
ఏసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండి, సిలువ మరణం పొందిన రోజునే గుడ్ ఫ్రైడే అంటారు. అదే రోజు ఆయనను సమాధి చేశారు. ఆపై మూడో రోజు అంటే ఆదివారం ఆయన సమాధి నుంచి తిరిగి లేచి మరణాన్ని జయించారని క్రైస్తవ విశ్వాసుల నమ్మకం. ఆ ఆదివారం సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అదే ఈస్టర్
Discussion about this post