ఒకప్పుడు గుళ్ళు గోపురాలను మనుష్యులు ఏళ్లతరబడి నిర్మించేవారు. దానికోసం శిల్పుల సహకారం తీసుకునే వారు. ఇపుడు రోజులు మారాయి.వినూత్నటెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మానవులు ఆ టెక్నాలజీ సాయంతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. 3 డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారి తెలంగాణ లో అద్భుతమైన ఆలయాలు ఆవిష్కృతమైనాయి. రోబోటిక్ తో నిర్మించిన గుడులపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం..
సిద్దిపేట పట్టణంలోని చర్విత మెడోస్ లో త్రీడి ప్రింటెడ్ టెక్నాలజీతో మూడు గుడులను నిర్మించారు.దేశంలోనే మొట్టమొదటిసారి సిద్దిపేట పట్టణంలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ గుడుల నిర్మాణం చేపట్టడం జరిగిందని ప్రాజెక్ట్ మేనేజర్ మనోజ్ చెప్పారు. మూడు హిందూ దేవాలయాలను అద్భుతంగా త్రీడి ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించామని ఆయన వివరించారు.
గుడుల నిర్మాణం కోసం దాదాపు 30 అడుగుల ఎత్తులో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు గర్భాలయాలు నిర్మించినట్టు మనోజ్ తెలిపారు. మోదక్’ ఆకారంలో గణపతి గుడి, దీర్ఘ చతురస్రాకారంలో శివుని గుడి, కమలం ఆకారంలో పార్వతి దేవి గుడులను నిర్మించారు.
రోబోటిక్ సహాయంతో మనుషుల అవసరం లేకుండానే, సింప్లిఫోర్జ్ చే అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్ తో 3d ప్రింటింగ్ పనిచేస్తుంది. 3d ప్రింటింగ్ లోదేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్ తో త్రీడీగా నిర్మాణం ముద్రించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీస్థాయిలో ప్రార్థనాస్థలంగా రూపుదిద్దుకున్న మొట్టమొదటి త్రీడీ- నిర్మాణం ఇదే కావడం విశేషం.
ఆలయ సూత్రాలను అనుసరిస్తూ, అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే మనకు కావలసిన ఆకారంలో 3d ప్రింటింగ్ నిర్మితమవుతుంది.త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అతి తక్కువ సమయంలోనే ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టవచ్చని మనోజ్ అంటున్నారు. అత్యవసర సమయంలో ఎక్కడైనా అతి తక్కువ సమయంలోనే పునరావాస కేంద్రాలను నిర్మించవచ్చని, ఎత్తైన ప్రదేశంలో కూడా ఆర్మీ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టవచ్చు. మామూలు నిర్మాణాల కంటే 10% తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయవచ్చని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో 3d ప్రింటింగ్ తో రోబోల సహాయంతో వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయవచ్చని .. దీంతో నిర్మాణవ్యయం తగ్గి నాణ్యతతో కూడిన గృహాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
























Discussion about this post