మన వాళ్లు చదువులో బాగానే ఉన్నారు… ప్రపంచంతో పోటీ పడుతున్నారు… విద్యారంగంలో చక్కగా రాణిస్తున్నారు… కానీ ఆటల్లోనే కొంత వెనుకబడుతున్నారు. ప్రపంచంతో అంతగా పోటీ పడలేక పోతున్నారు. దీనికి కారణం ఈ రంగంలో విద్యారంగానికి ఉన్నట్లు ప్రోత్సాహం గానీ, అనంతరం ఉపాధి అవకాశాలు గానీ లేకపోవడమేనని చెప్పవచ్చు. ఇకపై క్రీడలకు పెద్దపీట వేసే క్రమంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలోని స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న వర్సిటీలో డజనుకు పైగా స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు అవుతాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ సెంటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీనికి అనువైన స్థలం కోసం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు.
ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. 1976లో ప్రారంభించిన ఈ వర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత క్రీడావర్సిటీగా నిలిచింది. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా 32 పతకాలు సాధించగా… వాటిలో 16 పతకాలు కొరియన్ క్రీడావర్సిటీ క్రీడాకారులే తెచ్చారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీకి… కొరియన్ క్రీడా వర్సిటీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది.
2028లో లాస్‌ఏంజెలిస్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఆ ఒలింపిక్స్ లో మన దేశం పనితీరు మెరుగు పరిచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. హకీంపేట, గచ్చిబౌలిలోని 200 ఎకరాల క్యాంపస్‌లతో పాటు అన్ని క్రీడా స్టేడియాల్లో మౌలిక సదుపాయాలను ఒలింపిక్స్ గ్రేడ్‌కు సమానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Discussion about this post