దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి వివాదం గురువారం కొత్త మలుపు తిరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. కోర్టు నియమించే ముగ్గురు అడ్వకేట్ కమిషనర్ల ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై డిసెంబర్ 18న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
మథురలోని 17 వ శతాబ్దం నాటి షాహి ఈద్గా మసీదును శ్రీకృష్ణుని జన్మస్థలంలో నిర్మించారనేది హిందువుల వాదన. దీనిపై హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త అనే వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం పట్ల ముస్లింలు అభ్యంతరం తెలపడంతో వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది.
శ్రీకృష్ణ జన్మస్థలంలోని మొత్తం 13.37 ఎకరాల భూమిపై హక్కును హిందువులకే కల్పించాలని హిందూసేన డిమాండ్ చేస్తోంది. వివాదంలో ఉన్న భూమిని శ్రీకృష్ణ విరాజమాన్ కు అప్పగించాలని కోరుతోంది. మధురలోని కాట్ర కేశవ దేవ్ ఆలయాన్ని కూల్చి.. మసీదును నిర్మించారని వాదిస్తోంది. మసీదులోని కొన్ని గోడలపై తామరపువ్వులు, ‘శేషనాగ్’ని పోలి ఉండే ఆకారాలు ఉండటం దీనికి సాక్ష్యమని చెబుతోంది.
దీనిపై ముస్లింల వాదన మరోలా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను అలాగే కొనసాగించాలనే 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం పిటిషన్ తిరస్కరించాలని ముస్లింలు కోరుతున్నారు. అయితే, శ్రీ కృష్ణ జన్మస్థానం గురించి హిందూ, ముస్లిం పక్షాల మధ్య 1968లో ఒక ఒప్పందం జరిగింది. సేవా సంస్థాన్, షాహీ మజీద్ ఈద్గా ట్రస్టు సంతకాలు చేసిన ఈ ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమికి 10.9 ఎకరాలు, మసీదుకు 2.6 ఎకరాలను కేటాయించారు. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో అయోధ్య తరహాలోనే ఈ వివాదం కూడా పరిష్కారం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
Discussion about this post