అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని పేర్కొన్నారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు.
Discussion about this post