శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. దివంగత నేత ఎర్రన్నాయుడు…ఆ కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకంటే ముందే ఎర్రం నాయుడు పెదనాన్న కృష్ణమూర్తి… హరిశ్చంద్ర పురం ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. టిడిపి ఆవిర్భావంతో ఎర్రం నాయుడు ఆ పార్టీలో చేరి…. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరారు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా కొనసాగారు.
ఎర్రన్నాయుడి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో… ఆయన సోదరుడు అచ్చెనాయుడు ఆయన ఖాళీ చేసిన ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసి గెలుపొందారు. ఎర్రన్న అకాల మరణంతో కుమారుడు రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2019లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని బాబాయ్ టెక్కలి నుంచి అసెంబ్లీకి, అబ్బాయి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కింజరాపు రామ్మోహన్నాయుడు తెదేపా నుంచి హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఎదురుగాలి వీచినా ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైకాపా అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. మరోసారి రామ్మోహన రాగమే వినిపించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు మరోసారి బాబాయి, అబ్బాయి ఇద్దరు బరిలోకి దిగారు. అయితే వీరిద్దరిని ఓడించాలని జగన్ కృత నిశ్చయంతో…వారికి ధీటుగా గట్టి అభ్యర్థులను బరిలోకిదించారు. సామాజిక సమీకరణలకు పెద్దపీటవేశారు. అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాసును, రామ్మోహన్ నాయుడుపై పేరాడ తిలక్ లను బరిలో నిలిపారు. ఈ సమీకరణాలు పక్కాగా వర్కౌట్ అవుతాయని అందరూ భావించారు. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కాళింగ సామాజిక వర్గం ఓట్లు పోలరైజ్ అవుతాయని, దీంతో టెక్కలి నుంచి పోటీ చేస్తున్న అచ్చెన్నాయుడు ఓటమి ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చారు. కాళింగ సామాజిక వర్గమంతా ఏకమై వైసీపీకి మద్దతు తెలిపితే రామ్మోహన్ నాయుడు ఓడిపోతారని కూడా భావించారు. కానీ కాళింగులలో బలమైన చీలిక కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ వైపు 50% కాలింగులు మొగ్గు చూపడంతో జగన్ ప్రయత్నానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
టెక్కలి నియోజకవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కృపారాణి కాళింగ సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృపారాణిని జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల ప్రకటన సమయంలో కృపారాణి పేరు పరిగణలోకి తీసుకోవడం, ఆ తరువాత మరిచిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తనకు అవకాశం దక్కుతుందని, లేకుంటే టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని అయినా కేటాయిస్తారని భావించారు. కానీ ఆమె పేరును వైసీపి పరిగణలోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృపారాణి టిడిపిలో చేరతారని ప్రచారం జరగగా…ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. కాళింగ సామాజిక వర్గ ఓట్లు చీల్చాలని బలంగా నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ… తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపి కొత్త అభ్యర్థులను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి స్వరం వినిపించినప్పటికీ…కొద్ది రోజులకే మెత్తబడ్డారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి సద్దుమనిగింది. టిడిపి క్యాడర్ సైతం బలంగా పనిచేస్తోంది. దీంతో ఎంపీగా రామ్మోహన్ నాయుడుకి, టెక్కలిలో అచ్చెన్నాయుడుకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కు సొంత పార్టీ నుంచే ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. ఆయన భార్య సైతం దువ్వాడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయితే ఈసారి కూడా బాబాయి,అబ్బాయి గెలుపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అటు సర్వేలు కూడా గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి.
Discussion about this post