వేసవిలో విరివిగా లభించే పండ్లలో మామిడి ఒకటి… మామిడి పేరు చెబితేనే చాలా మందికి నోరూరుతుంది… అలాంటి మామిడి పంటపై ఆధారపడిన రైతులు, వ్యాపారులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు.
వాణిజ్య పంటలకు శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధి. జిల్లాల్లో జీడి, కొబ్బరి తోటల తర్వాత అదే స్థాయిలో మామిడి పంటను సాగు చేస్తుంటారు జిల్లాకు చెందిన రైతులు. మామిడికి సీజనల్ పంటగా గుర్తింపు ఉంది. శ్రీకాకుళం మామిడి పండ్లు విదేశాల్లోనూ మంచి గుర్తింపు పొందాయి. అయితే ఇటీవల మామిడి పంట పూర్వ వైభవం కోల్పో యే పరిస్థితి ఏర్పడిందని మామిడి తోటలపై ఆదారపడిన శ్రీకాకుళం జిల్లా రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీతో పాటు ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి తోటలు, జీడి తోటల తర్వాత మామిడి పంటలను ఇక్కడి రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
మెట్ట పంటగా సాగుచేసే మామిడి పంట సహజంగా ప్రతి ఏటా మార్చి నెల నుంచి ప్రారంభం అవుతుంది. మూడు నెలల పాటు కాపు కాస్తుంది. మామిడికి పూత మొదలయినప్పటి నుంచి పండుగా మారే వరకు అనేక దశల్లో రైతులు చిన్న పిల్లల్ని చూసినట్లు చూస్తారు. ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. పూత తర్వాత పిందెలుగా మారడం… ఆ తర్వాత కాయలుగా మారడం… కాయలుగా మారిన తర్వాత వాటిని చెట్టు నుంచి తెంపి మక్కబెట్టి పళ్లుగా మార్చడం వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ ఏడాది వాతావరణంలో మార్పుల కారణంగా పూత దశ నుంచే మామిడి పంట ఇబ్బంది ఎదుర్కొంది.
రైతులు మామిడి తోట పూత దశకు రాగానే పూతను రక్షించేందుకు క్రిమి సంహారక మందులు, ఎరువులు వాడుతారు. అందుకోసం రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వాణిజ్య పంటలుగా సాగు చేస్తున్నందున పెట్టుబడికి వెనుకడుగు వేస్తే పంట దిగుబడిలో చాలా వ్యత్యాసం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పెట్టుబడి పెట్టే విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాత తీరా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఈ ఏడాది మామిడి పంట దిగుబడి తగ్గడానికి వాతావరణ మార్పులే కారణమని రైతులు చెబుతున్నారు. వాతావరణ ఆదారిత పంట కావడంతో మామిడి పంటకు ఇన్స్ రెన్స్ సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు.
ముఖ్యంగా చెట్టుపైన పిందె పెరిగి కాయగా మారే దశలో వాతావరణంలో మార్పులు వచ్చి మంచు ఎక్కువగా కురవడం, చిరు జల్లులు కురవడం, బలమైన గాలి వీయడం లాంటి కారణాలతో నష్టం జరుగుతుంది. పంట కోసం పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించే రైతుల పరిస్థితి ఇలా ఉంటే… వాటిపై ఆదారపడ్డ మామిడి పండ్ల వ్యాపారులు కూడా ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. మామిడి తోట పూత దశకు రాగానే… చెట్టుపై పూతను చూసి ఒక అంచనాకు వచ్చి వ్యాపారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే డబ్బులు చెల్లిస్తారు. ఆ తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి ఆశించిన పంట రాక తామూ నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు.
పాకానికి వచ్చిన కాయల్ని చెట్టు నుంచి వేరు చేసి వినియోగదారులను ఆకట్టుకునే రంగు వచ్చే వరకు మక్కబెడుతారు. అయితే వాతావరణ మార్పులతో నష్టం జరగడం ఒకెత్తయితే… చేతికందిన పంట కాసులుగా మారాలంటే అవి మంచి పండ్లుగా ఉండి అమ్ముడు పోవాలి. వర్షం కురిస్తే మామిడి పండ్లు పురుగు పడుతాయి. వర్షాకాలం మొదలు కావడంతో ఆలస్యంగా కోతకొచ్చిన పండ్లు పురుగు పడుతున్నాయని వ్యాపారుల ఆవేదన చెందుతున్నారు. ఒక్కక్క వ్యాపారి తోట విస్తీర్ణాన్ని బట్టి రెండు లక్షల రూపాయల నుంచి మూడు, నాలుగు లక్షల రూపాయల వరకు పెట్టబడి పెట్టారు. ఇప్పుడా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించక పోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మామిడిలో ముఖ్యంగా నాలుగైదు రకాల పండ్ల తోటలు సాగవుతున్నాయి. రైతులకు వస్తున్న నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్ పైపులు, ఇతరత్రా వ్యవసాయానికి అవసరమైనవి రాయితీపై ఇవ్వాలని జిల్లా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటలకు బీమా వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మామిడి రైతులు ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. లేని పక్షంలో రైతులు మామిడి సాగుకు దూరమైతే… పంట ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
Discussion about this post