ఎవరూ ఊహించని విధంగా మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఓబీసీ నేత మోహన్ యాదవ్ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయడం వెనుక భారీ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుందని వివరిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవటమే బీజేపీ టార్గెట్ అని అంటున్నారు.
మధ్యప్రదేశ్లో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీల నేత అయిన మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్ లో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మార్చి 25న ఉజ్జయినిలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, పీహెచ్‌డీ చేశారు. కరడుగట్టిన హిందుత్వావాది అయిన మోహన్ యాదవ్ కు చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది.
మధప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ఎంపిక వెనుక బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతోనే యాదవ్ వర్గానికి చెందిన నేతను సీఎం పదవికి ఎంపిక చేశారని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే మధ్యప్రదేశ్ తోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో యాదవ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడం వల్లే మోహన్ యాదవ్‌ను మధ్యప్రదేశ్ సీఎంను చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో 29 లోక్ సభ సీట్లు ఉండగా ఉత్తరప్రదేశ్ లో 80, బీహార్‌లో 40 సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనేది బీజేపీ టార్గెట్. మోహన్ యాదవ్ భార్య ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో యాదవ్ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలను దెబ్బకొట్టేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Discussion about this post