మనీల్యాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 19 ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల అరెస్ట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రత్యేక న్యాయస్థానం జారీచేసిన సమన్లకు స్పందించి నిందితుడు హాజరైతే అరెస్టు చేసే అధికారం ఈడీకీ లేదని, ఇటువంటి సందర్భంలో ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నేరాన్ని గుర్తించిన తర్వాత…నిందితుడిగా చూపిన వ్యక్తిని పీఎంఎల్ చట్టం సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారం ఈడీకీ లేదని ఉద్ఘాటించింది. పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ఒక వ్యక్తి నేరం చేసినట్టు లిఖితపూర్వక ఆధారాలుంటే అరెస్టు చేయడానికి ఈడీకి అనుమతిస్తుంది. ముఖ్యంగా నిందితుడిగా ఉన్న వ్యక్తికి తన అరెస్టుకు గల కారణాలను దర్యాప్తు సంస్థ ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది.
ప్రత్యేకించి ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో.. వారిని అరెస్టు చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ప్రత్యేక న్యాయస్థానం ముందుగా సమన్లు జారీ చేయాలి.. ఆ సమన్లకు నిందితులు సరైన సమాధానమిస్తే వారు ‘కస్టడీలో’ ఉన్నట్లు చూడలేం’ అని పేర్కొంది.‘సమన్లకు హాజరై సమాధానం ఇచ్చిన తర్వాత నిందితుడ్ని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తే అందుకోసం ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేయాలి.. కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టు విశ్వసిస్తే కస్టడీకి అనుమతిస్తుందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సీపీసీ సెక్షన్ 70 ప్రకారం నిందితుడు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైనప్పుడు మాత్రమే అరెస్ట్ వారెంట్ జారీచేయాల్సి ఉంటుందని ధర్మాసనం నొక్కిచెప్పింది. తాజా తీర్పుతో ఈడీ ఏకపక్ష అరెస్టుల నుంచి రక్షణ కలిగించినట్టయ్యింది. కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వడానికి ముందు నిందితులను అరెస్టు చేయలేరని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై ఏప్రిల్ 30న విచారణ పూర్తిచేసిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజ్వర్ చేసింది. తాజాగా తీర్పును వెలువరించింది.
Discussion about this post