ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు, నిధులందుకున్న వారి వివరాలను బయట పెట్టే ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లను ఎందుకు వెల్లడించలేదని ఎస్‌బీఐని నిలదీసింది. ప్రతి బాండ్‌కు సంబంధించిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లతో సహా పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు మార్చి 18 న కోరింది..
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను బ్యాంక్ వెల్లడించిందని ధృవీకరిస్తూ మార్చి 21 సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. యునిక్ బాండ్ నంబర్లతో పాటు అన్ని వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ), అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII).. ఈ మూడు సంస్థలు ఎలక్టోరల్ బాండ్ నంబర్ల విడుదలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. వారి పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అత్యవసర విచారణను కోరారు. అయితే ఇతర దరఖాస్తుదారుల కంటే వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేమని, వారి పిటిషన్ విచారణకు జాబితా చేయబడలేదని కోర్టు తోసి పుచ్చింది.
Discussion about this post