ఢిల్లీ అసెంబ్లీ భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కొనసాగుతోంది. వందలాది మంది గస్తీ కాసే ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలోకి కారు దూసుకురావడం సంచలనం రేపింది. కారులో వచ్చిన సరబ్‌జిత్ సింగ్ స్పీకర్ కార్ పై ఇంక్ చల్లడం.. స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకే పెట్టడం సెక్యూరిటీ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది.

ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం బయటపడింది. CRPF బలగాల సెక్యూరిటీ ఉన్నపటికీ అసెంబ్లీ గేట్ ను కారుతో ఢీకొట్టి లోపలి ప్రవేశించాడు సరబ్‌జిత్ సింగ్ అనే వ్యక్తి. స్పీకర్ కారుపై ఇంక్ కూడా చల్లాడు.. అంతేకాకుండా, స్పీకర్ విజయేంద్ర గుప్త కార్యాలయం ముందు పూల బొకే పెట్టి తాపీగా అదే కారులో వెళ్లిపోయాడు. చేతిలో పూల బొకే నల్ల బ్యాగ్ తో నడుచుకుంటూ స్పీకర్ కార్యాలయం వైపు సరబ్‌జిత్ సింగ్ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అసెంబ్లీ గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి సరబ్‌జిత్ లోపలికి దూసుకొచ్చిన సమయంలో స్పీకర్ విజయేంద్ర గుప్త తన కార్యాలయంలోనే ఉన్నారు. అసెంబ్లీ ఆవరణలో కారుతో హల్ చల్ చేసిన సరబ్‌జిత్ సింగ్ ను రూప్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ను గుర్తించారు. సరబ్‌జిత్ సింగ్ ఉద్దేశం ఏంటో ఇప్పటివరకు అర్ధంకాలేదు. కేవలం ఆరు నిమిషాల్లో తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఎవరికి హాని జరగలేదు.. కానీ, వీవీఐపీల పై దాడి జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు.
సరబ్‌జిత్ సింగ్ స్పీకర్ కార్యాలయం ముందు పెట్టిన పూల బొకేలో బాంబు ఉందన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎలాంటి బాంబు లేదని బాంబు స్క్వాడ్ నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఎవరికి రక్షణ లేదని.. ఈ ఘటన నిరూపించిందని విమర్శించింది. అసెంబ్లీ గేట్ దగ్గర విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న ఢిల్లీ పోలీసులు.. సీఎంకు, స్పీకర్ కార్యాలయానికి రక్షణ కల్పించడంలో విఫలం అయ్యారని విమర్శించింది. మరోపక్క నిందితుడు సరబ్‌జిత్ సింగ్ స్వస్థలం యూపీలోని ఫిలిబిత్ లో కూడా దర్యాప్తు చేపట్టారు. సరబ్‌జిత్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు.
Follow us more updates
