పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలే ఆదర్శ పాఠశాలలు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వీటిలో సదుపాయాలు ఉంటాయని చెప్పిన ప్రభుత్వం… ఆ పేరు ప్రతిబింబించేలా వీటికి ఆదర్శ పాఠశాలు అని పేరు పెట్టింది. ఇంగ్లీష్ లో ముద్దుగా మాడల్ స్కూల్ అని పిలుస్తారు. నిజంగానే ప్రభుత్వం చెప్పిన ప్రకారం… ఈ ఆదర్శ పాఠశాలలు… ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నాయా? పేరుకు మాత్రమే ఆదర్శగా? ఈ విషయం తెలుసుకోవాలంటే… మనం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పరిస్థితి చూస్తే సరిపోతోంది. ఇక్కడి ఆదర్శ పాఠశాలలో అసౌకర్యాలపై, విద్యార్థులు పడుతున్న పాట్ల గురించి ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం…
ఇదే నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల. పాఠశాల పేరులో కనిపిస్తున్న ఆదర్శ వాస్తవ పరిస్థితిలో కనిపించదు. చక్కటి వాతావరణంలో పిల్లలు విద్య నేర్చుకోవాల్సిన చోట అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. విద్యార్థులను తాగునీటి సమస్య కూడా వెంటాడుతోంది. మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. మొత్తం మీద ఆదర్శ పాఠశాల వాతావరణం ఒక అడవిని తలపించేలా భయంకరంగా కనిపిస్తోంది. మరి ఈ సమస్యలకు కారకులెవరు? పాఠశాల ప్రిన్సిపలా? అధికారుల పర్యవేక్షణ లోపలా? ఎందుకని ఆదర్శంగా ఉండాల్సిన పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతోంది?
మరి ఆదర్శ పాఠశాలలో సమస్యలకు కారకులెవరంటే… సమాధానం నేరుగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే… ఈ పాఠశాలకు ప్రిన్సిపల్ ఉంటారు. కానీ పాఠశాల వ్యవహారంలో పట్టింపు ఉండదు. కారణమేదైనా ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే మారుతోంది. పాధ్యాయులు లేకున్నా విద్యార్థులే పాఠాలు నెర్చుకోవాలి. వసతులు లేకున్నా వంద శాతం ఫలితాలు సాదించాలి. అంటే చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ అమలులో సాధ్యం కాదు. అందుకే గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తిర్చిదిద్దలన్నా ఆదర్శ పాఠశాలల లక్ష్యం అమలుకొచ్చే సరికి నీరుగారిపోతోంది.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల సమస్యల వలయంలోని బయటకు రావడం లేదు. ఆ పాఠశాలకు రావాలనుకునే విద్యార్థులకు అక్కడ తిష్టవేసిన సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. కేతేపల్లి మండలంతో పాటు, పరిసర మండలాలకు చెందిన సుమారు 700 మంది వరకు విద్యార్థులు ఇక్కడ గతంలో విద్యను అభ్యసించేవారు. ఆ రోజుల్లో పాఠశాలలో పరిస్థితులు చక్కగా ఉన్నాయని భావించి విద్యార్థులను వారి తల్లిదండ్రులు అక్కడ చేర్పించారు. అయితే అందులో చేరిన తర్వాత పరిస్థితులు అర్థం చేసుకొని చాలా మంది ఆదర్శ పాఠశాలకు దూరమయ్యారు. ఫలితంగా 700 మందితో ఉండాల్సిన కొర్లపహాడ్ ఆదర్శ పాఠశాల 400 మంది విద్యార్థులకే పరిమితం అయింది.
ఇక్కడి ఆదర్శ పాఠశాలలో సమస్యలు తిష్టవేసినప్పటికీ పాఠశాల ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. పోనీ ఇతర అధికారులు వచ్చి పాఠశాలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? అంటే అదీ లేదు. ఫలితంగా ఆదర్శ పాఠశాలపై నమ్మకం సన్నగిల్లి చాలా మంది స్కూల్ విడిచి వేరే పాఠశాలలకు వెళుతున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు కూడా పని చేయడం లేదు. విద్యార్థులకు సరైన గాలి రావడం లేదు. విద్యార్థులు దోమల బెడద ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్ల పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారైంది. ఇక పాఠశాల ఆవరణలో గడచిన పది రోజులుగా మురుగునీరు నిలువ ఉన్నప్పటికీ… ఆ సమస్యకు కూడా పరిష్కారం చూపడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేసి పదేళ్లు గడుస్తుంది. ఆదర్శ పాఠశాల నిర్మించిన మొదట్లో ఇక్కడ చదువుకునేందుకు చాలా మంది విద్యార్థులు ముందుకొచ్చారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇక్కడి పాఠశాలలో చేర్పించేందుకు పోటీ పడేవారు. అంతటి ప్రాముఖ్యత మొదట్లో ఉన్నప్పటికీ రాను రాను పరిస్థితి అద్వాన్నంగా తయారవుతూ వస్తోంది. ఇక విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసేందుకు వంటలు కూడా పాఠశాల ఆవరణలోని చెట్లకిందనే చేయాల్సి వస్తోందని వంటచేసే సిబ్బంది వాపోతున్నారు. కనీసం వంట చేసేందుకు ప్రత్యేకంగా వంట గది లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నట్లు వంట సిబ్బంది చెబుతున్నారు.
వర్షాకాలం మొదలు కావడంతో సీజనల్ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Discussion about this post