జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఔరా అనిపిస్తుంటుంది. సినీ నటుడిగా తన సత్తా ఏమిటో ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు. రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణే కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ పవర్ స్టార్ అభిమానుల ఆశ మాత్రం వేరు. తమ ఆరాధ్య దైవమే కింగ్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ స్పెషాలిటీస్ చాలానే ఉన్నాయి. ఆయన కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా ..అంటే ప్రచారకర్తగా కూడా పనిచేసారు.
1996లో అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేశారు. 1998లో ఆయన నటించిన తొలిప్రేమ సినిమా సూపర్ హిట్ అవటమే కాక ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును పవన్ అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా అప్పట్లో రికార్డు సృష్టించింది.
పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేసారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యాక కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించి దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.
సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి. 2014లో జరిగిన స్టార్ ఇండియా సర్వే.. భారతదేశంలోని టాప్ 5 హీరోలలో పవన్ కల్యాణ్ ఒకరని తేల్చి చెప్పింది. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా.
జపాన్ దర్శకుడు అకీరా కురసోవా అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. ఆయన కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేశారు.
2001 ఏప్రిల్ లో శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సీ ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయిన తొలి దక్షిణ భారత సెలబ్రిటీ ఆయనే కావటం విశేషం. అదే సమయంలో మెగా స్టార్ చిరంజీవి కోకో కోలా ప్రోడక్ట్ థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు. 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ వ్యవరించారు. 2017 ఆగస్టులో ఏపీ ప్రభుత్వం అవయవ దానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారు.
Discussion about this post