తిండి లేకుండా కొన్ని రోజులు బ్రతుకుతాం.. నీళ్లు లేకుండా కొన్ని గంటలు బ్రతకగలం..మరి బట్టలు లేకుండా ఉండగలమా ? అని ప్రసిద్ద రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఒక కథలో చేనేత కార్మికుల దీనస్థితి ప్రశ్నిస్తారు.. ఎంత మంది ప్రశ్నించినా.. పరిస్థితుల్లో మాత్రం మార్పులేదు.. ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేనేలేవు.. భారత సిల్క్ సిటీగా ప్రసిద్ది గాంచిన ధర్మవరంలో ఏటా లక్షల చీరలు తయారైనా వారి వెతలు మాత్రం తీరడం లేదు. దళారులు కోట్లకు పడగలెత్తుతుంటే.. చేనేత అన్నలు రోజురోజుకు క్రుంగి కృషిస్తూ నలభై ఏళ్లకే కంటిచూపు, సత్తువ కోల్పోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఒక్కో పోగు తీసి 6 గజాల చీరను తయారు చేయడానికి ఎంతో శ్రమిస్తారు చేనేత కార్మికులు. మగువలను ఆకట్టుకునే డిజైన్స్, రంగులతో బహిరంగ మార్కెట్ లో చీరలు లక్షల ధరలు పలుకుతాయి. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు దళారులకు కాసులు కురిపిస్తుండ గా… నేతగాళ్లకు మాత్రం అర్థాకలి మిగులుస్తున్నాయి. ధర్మవరంలో దాదాపుగా 3 వేలకు పైగా సిల్క్ హౌస్ లు ఉన్నాయి. వీటిలో నేతన్నల ద్వారా తయారు చేయబడిన చీరలు సిల్క్ హౌస్ యజమానులు తక్కువ ధరకి కొంటారు.. ఇంకా చెప్పాలంటే వారు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి వస్తుంది. మార్కెట్ లో ప్రతి వస్తువుకు ధరను తయారే చేసే కంపెనీలు నిర్ణయిస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ ..ఉదాహరణకు ఒక చీర 10 వేల రూపాయలకు నేతన్న నుంచి కొంటే దళారులు 30 నుండి 40 వేల రూపాయలకు అమ్ముతారు.
ఒక పట్టు చీర తయారీకి జరీ- అచ్చులు వంటి అనేక వస్తువుల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. వారం నుంచి నెల రోజుల వరకు కష్టించాల్సి ఉంటుంది. కుటుంబ పోషణ దృష్ట్యా నేతన్నలు బహిరంగ మార్కెట్లో వీటిని అమ్ముకోవడం అసాధ్యం. దీంతో వీరు సిల్క్ హౌస్ ల బారిన పడుతున్నాన్నారు. అరకొరకు కొన్న సిల్క్ హౌస్ లు తమ దగ్గర స్టాక్ పెట్టుకొని దేశవ్యాప్తంగా పేరుగాంచిన షాపులకు, మాల్స్ కు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇందుకు అవసరమైన మూడి సరుకును మరియు తన కుటుంబ పోషణ నేరుగా బహిరంగ మార్కెట్లో విక్రయించడం అసాధ్యమనే చెప్పవచ్చు. అసలే గిట్టుబాటు ధరలు లేక నేతన్నలు కుదేలవుతుంటే భారీ స్థాయిలో ఏర్పాటైన మర మగ్గాల ప్రభావం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. మామూలు చేతి మగ్గంపై ఒక పట్టు చీరను తయారు చేయాలంటే వారం రోజులు పడుతుంది. కానీ మర మగ్గంపై కేవలం ఒక్క రోజులోనే చీర పూర్తి కావడం విశేషం.
దీని వల్ల చేనేతలకు రోజువారి కూలీ కూడా లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులకు మించి మరమగ్గాలు లేదా పవర్ లమ్స్ పై కోట్ల చీరలు తయారవుతున్నాయి. వీటిపై గతంలో కాటన్ టెర్లిన్ మొదలైన రకాల చీరలు తయారు చేయడం జరిగేది ఆధునిక రంగంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పట్టు వస్త్రాలు కూడా వీటి పై తయారు కావడంతో. చేనేత పరిశ్రమ కుదేలయ్యింది. మరమగ్గం పై నేసిన చీర, చేతి మగ్గం పై నేసిన ఇంచుమించు ఒకే మాదిరిగా కనిపించడంతో వినియోగదారులు వేలకు వేలు వెచ్చించలేక తక్కువ ధరకు లభించే మరమగ్గం చీరలకే మొగ్గుచూపుతున్నారు. పట్టు చీరలు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే ధరిస్తారు. దీంతో కూడా కొనుగోళ్లు తగ్గాయి. అయితే విదేశాల్లో ఈ చీరలకు చాలా డిమాండ్ ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. వారెక్కడ ఉన్నా.. చీరలకు మరీ ముఖ్యంగా పట్టు చీరలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఫారెన్ కు పంపడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఇది నేతన్నలకు కూడా మంచి ఆదాయాన్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వారిని ఆదుకోవాలి.























Discussion about this post