ప్రతి రాజకీయ నాయకుడికి ఒక కోటరీ ఉంటుంది. కోటరీ అంటే ..అధికారంలో ఉన్న నాయకుడికి సన్నిహితంగా మసలే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అధికారంలో లేనపుడు కూడా అలాంటి వ్యక్తులు కోటరీలో ఉంటారు. కోటరీలో ఉండే వ్యక్తుల సలహాలను అనుసరించే… నాయకుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కోసారి కోటరీలో ఉన్న వ్యక్తులు చేసే సూచనలు ..చెప్పే సలహాలు బూమరాంగ్ అవుతుంటాయి.కోటరీలో ఉండే వ్యక్తులు ఒక్కోసారి నాయకులను తప్పుదారి కూడా పట్టిస్తుంటారు. కొందరైతే నాయకుడిని కింది స్థాయి నేతలతో కలవనీయరు. మన నాయకుల్లో దాదాపుగా అందరికి కోటరీలున్నాయి. తెలుగు దేశం అధినేత చంద్రబాబుకి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి, వైసీపీ అధినేత జగన్ కి .. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి, చంద్రబాబు తనయుడు లోకేష్ కి కోటరీలున్నాయి. కోటరీలో సభ్యులు పర్మనెంట్ గా ఉండాలని లేదు .. ఒక్కోసారి మారిపోతుంటారు. వారి వ్యవహార శైలి బాగా లేదనుకుంటే నాయకులు వారిని పక్కన బెట్టేస్తారు. అలాగే అవినీతి ఆరోపణలు వచ్చినా దూరంగా పెడతారు. కానీ అందుకు భిన్నంగా వ్యహరించే నేతలు కూడా ఉన్నారు.
కొంతమంది కోటరీలో ఉండే వ్యక్తులు స్వలాభంతో వ్యవహరిస్తుంటారు. నాయకులు అలాంటి వారినే నమ్ముతుంటారు. అలాంటి వారినే నాయకులు పీఏలుగా, సలహాదారులుగా కూడా పెట్టుకుంటారు. నమ్మి అవకాశం ఇచ్చిన వారికి ఎవరైనా కృతజ్ఞతగా ఉండాలి. కానీ కొందరు అలా ఉండనే ఉండరు. నారా లోకేష్ కోటరీలో కొందరు అనామకులు చేరారు. పట్టుమని పది ఓట్లు కూడా తేలేని వ్యక్తులు లోకేష్ చుట్టూ ఉన్నారు. వారంతా చినబాబును పక్కదారి పట్టించారు….పట్టిస్తున్నారు.బయటి విషయాలు లోకేష్ కి తెలీయకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. అలాంటి వారిలో సాంబశివరావు ఒకరు. ఇతగాడు నారా లోకేష్ పీఏ గా చేస్తున్నారు. ఎన్నో ఆరోపణలు ఇతగాడి మీద ఉన్నప్పటికీ లోకేష్ వాటిని పట్టించుకోరు. 2014-19 మధ్య కాలంలో లోకేష్ మంత్రులు, ప్రజాప్రతినిధులను దూరంగా ఉంచడం.. వారు చెప్పే సమస్యలను పట్టించుకోకపోవడం కూడా పార్టీలో అసంతృప్తికి కారణమయ్యింది. లోకేష్ మీద తెలుగుదేశం పార్టీలో ఉన్న తీవ్ర అసంతృప్తి చివరకు ఆయన ఓటమికే దారి తీసింది. వీటన్నింటికి సాంబశివరావే కారణమని టీడీపీ నేతలు అంటారు.
ఇక పీఏ సాంబశివరావు వ్యవహారశైలి పట్ల ఎన్నో ఫిర్యాదులు రావడంతో మంగళగిరి నియోజకవర్గానికి ఆయనను పరిమితం చేశారు. 2022..లో పీఏ సాంబశివరావుపై ఆ పార్టీ మహిళా నేత దాసరి కృష్ణవేణి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మహిళా కార్యకర్తలను సాంబశివరావు లైంగికంగా వేధిస్తున్నాడని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా నేతలను పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్నారంటూ ఆమె తన అనునూయులతో కలిసి మంగళగిరి పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం కలకలం సృష్టించింది. ఈ విషయాలపై ప్రశ్నిస్తే.. తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కృష్ణవేణి… లోకేష్ పీఏపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కార్యకర్తలు.. పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ అంశంపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది. అయినా సాంబశివరావుపై చర్యలు లేవు. లైంగిక ఆరోపణలు వచ్చినా సాంబశివరావును అక్కడే ఉంచుకున్నారంటే అర్ధం ఏమిటి ? అని పార్టీ అభిమానులు వాపోతున్నారు.
సాంబశివరావు ..తన మనుషులను నారా లోకేష్ చుట్టూ పెట్టి ఆయన ప్రతి కదలికను పసిగడుతుంటాడు. ఎవరెవరు లోకేష్ ను కలవడానికి వస్తుంటారు. ఎవరెవరిని అనుమతించాలి అన్న అంశాలపై అక్కడ సిబ్బందికి తరచూ సూచనలు ఇస్తుంటాడు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకులకు లోకేష్ కలిసేందుకు పర్మిషన్ ఉండదు. ఎవరైతే ఆమ్యామ్యా ముట్ట చెబుతారో వారిని ముందు లోపలికి పంపుతాడు. లేదంటే వెయిటింగ్ లో పెడతాడు. పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా ఈయన ప్రవర్తన ఇలాగే ఉండేదని ఆరోపణలున్నాయి. నాయకులకు .. లోకేష్ కి మధ్య అంతరం పెరగడానికి సాంబశివరావే కారణమని అంటారు.
చిలకలూరి పేట నియోజకవర్గం తిమ్మాపురానికి చెందిన సాంబశివరావు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినవాడు. పెద్దగా చదువుకోలేదు. గ్రామంలో తిరునాళ్ళకు, జాతర్లకు రికార్డింగ్ డాన్సులు వేసేవాడు. చిలకలూరిపేటలో ఒక ప్రయివేటు కంపెనీలో సాధారణ గుమస్తాగా జీవితం ప్రారంభించిన ఇతగాడు లోకేష్ వ్యక్తిగత సహాయకుడిగా చేరి ఎవరూ ఊహించని ఉచ్ఛ స్థితికి ఎదిగాడు. ఒకానొక దశలో హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లోని హోటల్లో క్యాషియర్గా కూడా చేసాడు. ఆ తర్వాత స్టూడియో ఎన్ లో జర్నలిస్టుగా చేరి తనకున్న పరిచయాలతో తెలుగు దేశం పార్టీ ఆఫీసులో ఉద్యోగం చేసాడు. తర్వాత లోకేష్ పీఏగా కొత్త అవతారమెత్తాడు. ఒకనాడు 2సెంట్ల రేకుల ఇంట్లో నివాసం ఉన్న సాంబశివరావు ఇపుడు విలాసవంతమైన బిల్డింగ్ లో ఉంటున్నాడు. ఇంకా ఖరీదైన విలాసవంతమైన ఫ్లాట్స్, బ్యాంక్ బాలన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బెట్టింగులు, కోకాపేట ప్రాంతంలో భూములు, ఫ్లాట్స్ ఇలా అయ్యగారి ఆస్తుల చిట్టా తీస్తే ఆశ్చర్య పోతారు. ఇవన్నీ ఎలా వచ్చాయో ఊహించుకోవచ్చు. ఇక సాంబశివరావు పాస్ పోర్ట్ చెక్ చేస్తే ఎన్ని విదేశీ పర్యటనలకు వెళ్లారో తెలిసిపోతుంది.
ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినపుడు కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వస్తే ..ఇతగాడు మాత్రం పేకాట,క్రికెట్ బెట్టింగ్ లతో కాలక్షేపం చేసాడనే ఆరోపణలున్నాయి. ఒక ముఖ్య రాజకీయ నాయకుని వద్ద పనిచేస్తున్న వ్యక్తి కి ప్రముఖులతో సంబంధాలుంటాయి. లోకేష్ వ్యక్తిగత కార్యదర్శి కాబట్టి ఇతగాడిని ప్రసన్నం చేసుకుంటేనే కానీ లోకేష్ దర్శన భాగ్యం దొరికేది కాదనే ఆరోపణలున్నాయి. ఈ సాంబశివరావుకు ఒక సర్వే టీమ్ కూడా ఉందని అంటారు. పలుచోట్ల సర్వేలు నిర్వహించి అనుకూల రిపోర్టులు తయారు చేసి పెద్దమొత్తంలో సొమ్ము తీసుకునేవాడని అంటారు. అలాగే టీడీపీ సమాచారాన్ని వేరే పార్టీ నేతలకు చేరవేస్తున్నారనే తీవ్రస్థాయి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తిని లోకేష్ ఎందుకు తన పీఏ గా పెట్టుకున్నారో ? ఆరోపణలు వచ్చినప్పటికీ ఎందుకు భరిస్తున్నారో అని పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి డామేజ్ చేస్తున్న ఇతగాడిని చినబాబు వదిలించుకోకపోతే పార్టీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉందని వేరే చెప్పనక్కర్లేదు.
Discussion about this post