ప్రకాశం జిల్లాలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతూనే ఉంది. ఎవరెన్ని చేసినా అక్రమ మైనింగ్ దందాను యధేచ్చగా కొనసాగిస్తోంది. దీని వెనుక దాగున్న చీకటి కోణాన్ని 4 సైడ్స్ టీవీ ఇప్పటికే వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అక్రమ మైనింగ్ పై తవ్విన కొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన.. సీఎంఓ అధికారులు, ప్రభుత్వపెద్దల సహకారంతో మైనింగ్ మాఫియా గ్రానైట్ రాయిని ఎల్లలు దాటించేస్తోంది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి, రామతీర్థాలలో నిబంధనలను అతిక్రమించి గ్రానైట్ మైనింగ్ సాగుతోందన్నది ముమ్మాటికీ వాస్తవం. కోర్టు ఆదేశాలతో 2021 అక్టోబర్ లో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలోని వక్రభాష్యం ఇందుకు నిదర్శనమని బాధితులు చెబుతున్నారు. దీనిపై కోర్టుకు ఎక్కారు కూడా. తమకు హక్కు ఉన్న భూమిని అక్రమ రిజిస్ట్రేషనుతో ఆక్రమించేసి మైనింగ్ చేస్తోన్న ఓ కంపెనీ చర్యలను సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు వాస్తవాలపై నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా అడ్మినిష్ట్రేనును ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక విస్తుపోయేలా ఉందని బాధితులు వాపోతున్నారు. అసలు ఈ దందా కథా కమామిషు ఏమిటో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం..
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మైనింగ్ అక్రమాల చిట్టాను స్థానికులెవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. జిల్లా కలెక్టర్ అప్పట్లో నామమాత్రంగా తనిఖీలు జరిపి అంతా బాగానే ఉందని నివేదిక ఇచ్చారని పేర్కొంటూ పిటిషనర్లు కోర్టు ముందు వాస్తవాలను ఉంచారు. తెరవెనుక సిఎంఓ జోక్యంతోనే క్షేత్రస్థాయిలో అధికారులు దాసోహమంటూ న్యాయానికి గంతలు కట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ సంస్థలు చట్టాన్ని అతిక్రమించినా., కంపెనీ పేర్లను ఎడా పెడా మార్చేసినా., ప్రభుత్వానికి చెల్లించాల్సిన అపరాధ రుసుము ఏళ్ల తరబడి బకాయి ఉన్నప్పటికీ లీజు అగ్రిమెంట్లు రెన్యువల్ అవుతూనే ఉన్నాయి. ఈ దందాపై బాధితుడు సురేష్ ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Discussion about this post