ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి 1 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 93 పరీక్షా కేంద్రాల్లో 82,776 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 40,874 మంది ఉండగా, వారిలో బాలురు 21,693, బాలికలు 19,181 ఉన్నారు. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 41,892 ఉండగా, వారిలో బాలురు 21,800, బాలికలు 20,092 మంది పరీక్షలు రాయనున్నారు.
ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారి, ఇంకా జిల్లావ్యాప్తంగా తనిఖీలకు ఐదు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను ప్రభుత్వం కేటాయించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్‌టికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌తోపాటు తమ కాలేజీ ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించరు… కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
విద్యార్ధులు పరీక్షల్లో బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. విద్యార్ధులు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు. పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్ధులు కూర్చుని పరీక్షలు రాయాలి. మాల్ ప్రాక్ట్రీస్, కాపీయింగ్‌ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది.
Discussion about this post