ప్రపంచం మారిపోయింది. అభివృద్ధి పరుగులు తీస్తోంది. వేల కిలోమీటర్ల దూరంలోని గమ్యాన్ని గంటల్లోనే చేరుకుంటున్నాం. అంతరిక్షంలోకి టూర్లు వేస్తున్నాం. మృత్యువు అంచుల్లో ఉన్నవారికి అత్యాధునిక వైద్యంతో ప్రాణాలు పోస్తున్నాం. వాహ్.. అంతా బాగుందని ప్రభుత్వాలు జబ్బలు చరుచుకుంటున్నాయి. కానీ.. ఇదే భూమిపై మరో ప్రపంచమూ ఉంది. అక్కడి జనం దుర్భర జీవనం గడుపుతున్నారు. ఊరు చేరాలంటే కాలి నడకన మైళ్ల దూరం.. రాళ్ళూ రప్పలూ.. ముళ్ల డొంకలూ.. వాగులూ ..వంకలూ దాటుతూ వెళ్లాల్సిందే. అలాంటి నరకంలో ఉన్న ఊరే ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు.
చిక్కటి దండకారణ్యంలో ఉన్న గిరిజన గ్రామం పెనుగోలుకు చేరాలంటే కొండలూ… కోనలూ.. వాగులూ వంకలు దాటుతూ 22 కిలోమీటర్లు నడవాలి. సామాజిక బాధ్యతతో ఫోర్ సైడ్స్ టీవీ బృందం ఆ సాహసం చేసింది. సాయంత్రం 6 గంటలకు కాలినడకన ప్రయాణం మొదలెట్టి అర్ధరాత్రి 12 గంటలకు పెనుగోలుకు చేరుకుంది.
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం నుండి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో దండకారణ్యంలో పెనుగోలు గ్రామం ఉంది. ఈ గ్రామం తెలంగాణ – ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలి నడకన ఐదు గుట్టలు.. ఐదు వాగులు దాటి వెళ్లాల్సిందే. ఇక్కడ ఓ గ్రామం ఉన్నట్టు చాలా తక్కువ మందికి తెలుసు. బ్రిటిష్ కాలం నుండి తమ గ్రామం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు 150 కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం 25 కుటుంబాలే ఉంటున్నాయి. వ్యవసాయం, పశువుల పెంపకం, అటవీ ఫలసాయం, బుట్టల అల్లకం వంటి పనులతో జీవనం సాగిస్తున్నాయి. వారానికి ఒకసారి ఈ ఉత్పత్తులను 22 కిలోమీటర్లు నడిచి వచ్చి సంతలో అమ్ముకుంటారు. వచ్చిన సొమ్ముతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి మళ్లీ అంతదూరం నడిచి ఊరికి చేరుకుంటారు. గ్రామస్తులు తాగు నీటి అవసరాలకు వాగులు, చెలమలలోని నీరే ఆధారం.
పెనుగోలు గ్రామస్తులకు దండకారణ్యంలోనే పట్టా భూములు ఉన్నాయి. ఈ భూముల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. రైతు బంధు వంటి కొన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సోలార్ విద్యుతే వారికి ఆధారం. వర్షాలు పడితే వాగులు పొంగి పొర్లుతాయి. ఈ సమయంలో ఊరు దాటటం అసాధ్యం. వర్షాకాలంలో ఎవరైనా అనారోగ్యం పాలయితే వారి ప్రాణాలు గాల్లో దీపమే. గతంలో చాలామంది రోగులు, గర్భిణులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు కూడా. గ్రామంలో పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రం లేవు. గ్రామస్తులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులు ఉన్నాయి. అంత దూరం నుంచి రేషన్ బియ్యం మోసుకుని రాలేక తీసుకోవటం లేదు. ఓటు వేయాలంటే 22 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వెళ్లాల్సిందే. మూడు నెలల క్రితం ఓ గర్భిణీ స్త్రీ వాగు దాటుతున్న క్రమంలో కడుపులో ఉన్న పాపతో సహా మృతి చెందిందని గ్రామస్తులు వాపోయారు. కరోనా సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క గ్రామానికి వెళ్లి నిత్యవసర వస్తువులు అందజేశారు. ప్రస్తుతం ఆమె మంత్రి అయ్యారు. అయినా పెనుగోలు గ్రామస్తుల సమస్యలపై ఇంకా దృష్టి పెట్టలేదు.
Discussion about this post