చిన్నారి జాహ్నవి మిస్సింగ్ పై వీడని మిస్టరీ..! | Tuni Missing Girl Mystery Case

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులైనా ఆచూకీ దొరకలేదు. బాలిక అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు, కొండచిలువ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

తోట, కొండ ప్రాంతం సరిహద్దు వద్ద ఇనుప కంచెకు బాలిక ఆనవాళ్లతో ఉన్న రెండు బొమ్మలను అమర్చారు. వీటిలో మాంసాహారం పెట్టారు. ఆ వాసనకు జంతువులు రావొచ్చన్న అంచనాతో చుట్టూ కెమెరాలు అమర్చి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రి, తెల్లవారుజామున థర్మల్‌ డ్రోన్లు, రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించే కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. అపహరణ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత.. జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌తో మాట్లాడారు. మరోపక్క, డీఎస్పీ తిలక్‌ మాట్లాడుతూ చిన్నారి అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందా.. అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నామన్నారు. 6 కిలోమీటర్ల పరిధిలో వెతికామని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 10 కిలోమీటర్ల వరకు గాలించాయని వివరించారు. 170 ఫోన్‌ కాల్స్‌నూ విశ్లేషించి ఆయా వ్యక్తులను నాలుగు బృందాలు విచారిస్తున్నాయన్నారు. చిన్నారి ఇనుప కంచె దాటి వెళ్లిన తర్వాత ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే దిశగా కేడీపేట వరకు రెండు బృందాలు వెళ్లాయన్నారు. 15 రోజుల క్రితం సంచార జాతులకు చెందిన కొందరు ఈ ప్రాంతానికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లారని, వీరి కోసం ఆరా తీస్తున్నామని వెల్లడించారు.

చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్సయిందని చెప్పుకొచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి సమాచారం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జీడీ పిక్కలు ఏరుకునే వారిని కూడా పిలిచి చిన్నారి గురించి విచారించామని తెలిపారు. పాప మిస్సయిన చోట బొమ్మలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నారికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచురించే వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తిలక్ హెచ్చరించారు.

పాపను జంతువులు తీసుకెళ్లాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. జీడి పిక్కలను ఏరుకునే సంచార జాతుల వారిపై నిఘా పెట్టి విచారణ చేస్తున్నామని తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబం పెంచుకుంటున్న కుక్కకు నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతోనే చనిపోయిందని వెల్లడించారు. కుక్క పోస్టుమార్టం రిపోర్టు రెండు రోజుల్లో వస్తుందని డీఎస్పీ తిలక్ పేర్కొన్నారు.

మరన్ని వార్తల కోసం ఫాలో అవ్వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top