ఓరుగల్లు పేరు చెబితే అందిరికీ గుర్తొచ్చేది కాకతీయుల చరిత్ర… వారి శిల్పకళా సంపద… గుళ్లు, గోపురాలు… అలాంటి కాకతీయుల చరిత్రకు ముందే ఓరుగల్లులో కాకతీయ శిల్పకళను పోలిన ఆలయం ఒకటి ఉందని… దానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని… దేశంలోనే అలాంటి ఆలయం మరొకటి ఎక్కడా లేదని ఎంత మందకి తెలుసు? దేశంలో మరెక్కడా లేని ఓరుగల్లు దేవునిగుట్ట నర్సింహాస్వామి ఆలయం ప్రత్యేకతపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం…
ఇది ఓరుగల్లు జిల్లా… కాకతీయుల ఖిల్లా… ఈ జిల్లాలో ఎటువైపు వెళ్లినా కాకతీయుల చరిత్రకు దర్పణం పట్టే నిర్మాణాలు కనిపిస్తాయి. అది వెయ్యి స్థంబాల గుడి కావచ్చు… రామప్పగుడి కావచ్చు… ఖిల్లా వరంగల్ కావచ్చు… పాకాల చెరువు కావచ్చు… మరొకటి కావచ్చు… ఓరుగల్లు అంటేనే కాకతీయులు… కాకతీయలు అంటేనే ఓరుగల్లు అన్నట్లు ఈ రెండు పేర్లు ఒకదానితో మరొకటి విడదీయరాని బంధం ఏర్పరచుకున్నాయి. అంతటి బంధం ఏర్పరచుకున్న ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయులకు మరో వెయ్యేళ్ల ముందే… కాకతీయ శిల్పకళను పోలిన గుడి ఇప్పటి ములుగు జిల్లా కొత్తూరు గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో దట్టమైన అడవిలో ఓ గుట్టపైన బయటి ప్రపంచానికి కనిపించని విధంగా ఉందీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయం.
విచిత్రమేమిటంటే… ఇక్కడో ఆలయం ఉన్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. రెండు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన దేవునిగుట్ల ఆలయం గురించి బయటి ప్రపంచానికి మొదటి సారిగా 2018లోనే తెలిసింది. దేవునిగుట్ట ఆలయాన్ని పోలిన ఆలయం మరొకటి లేదని చరిత్ర చెబుతోంది. అయితే ఈ ఆలయం కాంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉంటుంది. చూడండి ఆలయానికి ఉపయోగించిన రాళ్లు ఏ విధంగా చెక్కబడ్డాయో…? నిర్మాణానికి వినియోగించిన ప్రతి రాయి కూడా శిల్పంగా చెక్కబడిందే. అయితే ఏకశిలా నగర చరిత్రలో కొత్త చరిత్రకు తెరదీస్తూ ఇక్కడి నిర్మాణం ఉంది. శిల్పాలు ఏకశిలతో కాకుండా… అనేక రాళ్లపై చెక్కిన శిల్పాల కలయికగా కనిపిస్తాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో గుడి చుట్టూ గోడ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లపై శిల్పాలు.
ఇంతటి ప్రాచుర్యం కలిగిన దేవునిగుట్ట ఆలయానికి చేరుకోవాలంటే… కొత్తూరు గ్రామం నుంచి వెళ్లాలి. ఇది కొత్తూరు గ్రామం… సరిగ్గా ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది దేవునిగుట్ట… అదిగో చూడండి దట్టమైన చెట్లతో ఎత్తుగా కనిపిస్తోన్న ఈ ప్రాంతమే దేవునిగుట్ట. ఆ గుట్టపైనే నర్సింహాస్వామి దేవాలయం రెండు వేల ఏళ్ల క్రితం నిర్మాణమైంది. మనమిప్పుడు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేద్దాం… ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో గుట్టపై ఉన్న ఈ ఆలయానికి సరైన మార్గం లేదు. కొంత దూరం మట్టి దారిలో ద్విచక్ర వాహనాలు వెళుతాయి. ఆ మార్గంలోనే ఫోర్ సైడ్స్ టీవీ కూడా వెళ్లింది. అయితే అక్కడికి వళ్లేందుకు స్థానికుల సహకారం కూడా ఫోర్ సైడ్స్ టీవీ తీసుకుంది. కొంత మంది స్థానికులను వెంట బెట్టుకొని దేవునుగుట్టపైకి బయలుదేరింది ఫోర్ సైడ్స్ టీవీ బృందం.
ద్విచక్ర వాహనాలతో కొంత దూరం మేర మాత్రమే వెళ్లగలిగాము. ఇక ఆ తర్వాత తప్పనిసరిగా కాలినడకన గుట్టపైకి వెళ్లాల్సిందే. స్థానికులను వెంట బెట్టుకొని ఫోర్ సైడ్స్ టీవీ బృందం దేవునిగుట్టపైకి కాలినడకన బయలుదేరింది. చుట్టూ దట్టమైన చెట్లూ… రాళ్లు… రప్పల మధ్యనే నడక సాగించాలి. ఆ లెక్కను చెట్లను, రాళ్లను, రప్పలను దాటుకుంటూ మొత్తం మీద దేవునిగుట్టపైకి చేరుకున్నాము. ఆలయానికి చేరుకునే ముందు కొంత దూరం నుంచే పురాతన ఆలయం మనకు దర్శనం ఇస్తోంది. చక్కటి శిల్పకళా నిర్మాణంతో ఉన్న ఆలయంలో లక్ష్మీ నర్సింహాస్వామి వారి విగ్రహం ఉంటోంది. ఏడాదికోసారి ఇక్కడ స్థానికులు ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఆలయం మొత్తం రాతి నిర్మాణంలో… శిల్పకళతో ఏర్పాటు కాగా… ఒకే ఒక్క చోట మాత్రం కర్రను వినియోగించారు. అది కూడా గర్భగుడిలోకి వెళ్లే ముఖద్వారం వద్ద. చూడండి ఈ కర్రపై ఎన్ని రాళ్లు ఉన్నాయో? అన్ని రాళ్లు ఉన్నప్పటికీ కర్ర మాత్రం పటుత్వం కోల్పోవడం లేదు. కర్ర విరిగితే గర్భగుడికే ప్రమాదం అన్నట్లుగా కనిపిస్తోంది. గుడి నిర్మాణాన్ని బయటి నుంచి పరిశీలిస్తే కూడా శిల్పకళా సంపదే దర్శనమిస్తోంది. చూడండి ఆలయం నిర్మాణం ఎంత చక్కగా శిల్పాలతో చెక్కబడిందో. అయితే ఇక్కడి ప్రజలకు ఓ నమ్మకం కూడా ఉంది. ఇక్కడ ఉత్సవాలు చేయడం ద్వారా ప్రతి ఏటా వర్షాలు కురుస్తాయనేది కొత్తూరు గ్రామస్థుల నమ్మకం. అందుకే ఈ గ్రామస్థలు ప్రతి ఏటా వరదప్రసాదం పేరిటి వేడుక నిర్వహిస్తారు. వేడుక నిర్వహించిన రోజు తప్పకుండా వర్షం కురుస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇంతటి ప్రకృతి రమణీయతను చూస్తేనే కడుపునిండా అన్నం తిన్నట్లు అనిపిస్తోంది ప్రకృతి ప్రేమికులకు… అందులోనూ ఇక్కడి నీళ్లు… ఎక్కడా లేని విధంగా తియ్యగా ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. అక్కడి చెట్లు, రాళ్లు, మట్టి బహుషా నీటి తియ్యదనానికి కారణం కావచ్చు. ఇక మరో విశేషం ఏమిటంటే… దేవునిగుట్లపై ఉన్న కోనేరు చాలా చిన్నదిగా కనిపిస్తోంది. కానీ ఏడాదిలో ఏ ఒక్క రోజూ కోనేరులో నీరు ఇంకిపోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కొత్తూరు దేవునిగుట్ట ఆలయాన్ని అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతికి నష్టం లేని విధంగా… ఈ ప్రాంత విశిష్టతను బయటి ప్రపంచానికి తెలిసేలా అభివృద్ది చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇదీ కొత్తూరు దేవునిగుట్ట ఆలయం చరిత్ర.
Discussion about this post