మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ఎన్నికలు జరగాలన్న ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై జరిగిన దాడిగా ఈడీ చర్యను ఆయన అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో, ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని దుయబట్టారు. ఈడీ ద్వారా మనీలాండరింగ్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందనడానికి ఇదో ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకాకపోవడంతోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈడీ పేర్కొనడంపై కేజ్రీవాల్ తిరుగు సమాధానమిచ్చారు. తనకు వచ్చిన సమన్లకు తగిన విధంగానే స్పందించానని, దర్యాప్తునకు సహకరించడంలేదని ఈడీ కూడా ఎన్నడూ చెప్పలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఈ కేసుకు కావల్సిన సమాచారాన్ని, పత్రాలను రాత పూర్వకంగా, వర్చువల్ విధానంలో కోరి ఉండవచ్చని పేర్కొన్నారు. లేదంటే అధికారిని పంపించి అయినా కావాల్సిన వివరాలను రాబట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఇవేవీ చేయని ఈడీ….తనను కస్టడీలో ఉంచి విచారిస్తేనే విషయాలను రాబట్టగలమన్నట్లు వ్యవహరించిందని ఆక్షేపించారు.
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, రాజ్యాంగాన్ని మార్చివేయడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని చెప్పారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ ఉన్నంతవరకు ఏ శక్తీ రిజర్వేషన్లను తొలగించలేదని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం హిందీలో ట్వీట్ చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలన్నది బీజేపీ ఆలోచన కాగా, ఆ పార్టీ మాత్రం కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్లు తీసివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
భారత యుద్ధ విమానాలకు మరో అస్త్రం జతపడింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ సూపర్ సానిక్ ‘రాంపేజ్’ క్షిపణులను వాయుసేన, నౌకా దళాలకు అందజేశారు. వీటిని ఆకాశం నుంచి నేల పైకి ప్రయోగిస్తారు. ఇవి 250 కి.మీ.దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. టీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో ఇజ్రాయెల్ వీటిని ప్రయోగించినట్టు సమాచారం. వాయుసేనలోని ఎస్‌యూ-30 ఎంకెఐ, మిగ్-29 యుద్ధ విమానాలకు, జాగ్వార్ ఫైటర్ జెట్లకు ఈ క్షిపణులను అమర్చుతారు. 2020లో చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కల్పించిన ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకొని సైన్యం ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. 2019లో బాలాకోట్ దాడుల్లో ఉపయోగించిన స్పైస్-2000 క్షిపణుల కన్నా ‘రాంపేజ్’లు ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తాయి. కాగా, 15 రోజుల క్రితం అండమాన్-నికోబార్ దీవుల్లో ‘రాక్స్’ బాలిస్టిక్ మిస్సైళ్లను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ‘రాంపేజ్’లను స్వదేశంలోనే తయారు చేయాలని కూడా వాయుసేన భావిస్తోంది.
తాను భోజనం చేస్తుంటే 2 సార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని… తాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని రేవంత్ సర్కార్ పై ఆగ్రహించారు. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని… రోజుకు పదిసార్లు కరెంటు పోతుందని తనకు చాలా నియోజకవర్గాల నుంచి సమాచారం అందుతుందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు కేసీఆర్.
Discussion about this post