ఇప్పుడు దేశమంతా వినపడుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ భయం తెలియని ఆటతీరుతో గ్రౌండ్ లో పూనకాలు తెప్పిస్తున్నాడు.

ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్ అస్సలు ఒత్తిడి లేకుండా లెంత్ బాల్స్, షార్ట్ పిచ్ బాల్స్, ఆఖరికి యార్కర్లను సైతం బౌండరీ రోప్స్ ను అలవోకగా దాటిస్తున్నాడు. అలాంటి అద్భుత ఆటకు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చర పిడుగును ఐపీఎల్‌కు పరిచయం చేసింది ఎవరు? అతడి ఐపీఎల్ ఎంట్రీ వెనక ఉన్న కథ ఏంటి?
వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్‌కు తీసుకొచ్చింది మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అని చాలామంది భావిస్తుంటారు. కానీ బుడ్డోడి టాలెంట్‌ను ముందు గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా పనిచేస్తున్న సమర్ ఖాద్రి. ఓ లోకల్ మ్యాచ్‌లో చిన్న వయసులోనే వైభవ్ భారీ సిక్సర్లు కొట్టడం చూసి సమర్ ఆశ్చర్యపోయాడట. అప్పుడే ఈ కుర్రాడిలో అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించాడు. ఆ తర్వాత ఒకసారి రాజస్థాన్ రాయల్స్ మాస్టర్‌మైండ్ జుబిన్ భరూచా.. టాలెంటెడ్ యువ ఆటగాళ్లను గుర్తించాలని సమర్ ఖాద్రికి సూచించాడు. వెంటనే అతడు వైభవ్ పేరును చెప్పాడు.
సమర్ ఖాద్రి చెప్పడంతో వైభవ్‌ను చెన్నైలో నిర్వహించిన స్కౌటింగ్ ట్రయల్స్‌కు ఆర్ఆర్ కోచింగ్ స్టాఫ్ పిలిచింది. అక్కడ బుడ్డోడు తన బ్యాటింగ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. కేవలం 60 బంతుల్లోనే 150కి పైగా పరుగులు బాదటమే కాకుండా.. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు. ఆ ఇన్నింగ్స్ చూసిన రాజస్థాన్ మేనేజ్మెంట్, కోచ్‌లు ఫిదా అయిపోయారు.
దీంతో 2024లో సూర్యవంశీని కోటి 10 లక్షలకు ఆర్ఆర్ కొనుగోలు చేసింది. అయితే అతడు 2024 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జట్టు అతడిని భవిష్యత్తు కోసం సిద్ధం చేసింది. అనంతరం 2025 సీజన్లో వైభవ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి సీజన్లోనే 7 మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొంటూ మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడు. బుమ్రా, బౌల్ట్, భువీ, షమీ, సిరాజ్, కమిన్స్, హేజిల్‌వుడ్, రబాడ, నరైన్ లాంటి టాప్ బౌలర్లను కూడా వదలలేదు. మొదటి బంతి నుంచి బౌలర్లపై విరుచుకుపడుతూ చూస్తుండగానే హాఫ్ సెంచరీ, సెంచరీ బాదేస్తున్నాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు.
ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా.. నార్మల్ క్రికెట్ ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. ‘ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లు ఎవరు?, ఈ పిచ్‌పై వారిని ఎలా ఎదుర్కోవాలి?, బౌండరీలు ఎంత పెద్దగా ఉన్నాయి? లాంటి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని వైభవ్ చెప్పడం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Follow for more updates
