సినీజనాల్లో ఎవరైనా ఉన్నత పదవులు అధిరోహిస్తే చిత్రసీమ వారివైపు ఆశగా చూస్తూ ఉంటుంది… తమిళనాట విజయ్ ముఖ్యమంత్రి కాగానే కోలీవుడ్ కూడా అదే తీరు ప్రదర్శిస్తోంది… ఇంతకూ విజయ్ ని కోలీవుడ్ ఏం కోరుతోంది… !?

దళపతి విజయ్ ముఖ్యమంత్రి కాగానే పలువురు తమిళ సినీజనం ఆయన వైపు ఆశగా చూస్తున్నారు… చిన్న సినిమాను కాపాడితే ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు… ‘చిన్న సినిమా చితికితే చిత్రసీమలో చింతలే’ అన్నది సినిమా నానుడి… ‘స్మాల్ బడ్జెట్ మూవీస్’ సమస్యను విజయ్ ముందు ఉంచారు కొందరు…
చిన్న సినిమాల కోసం గవర్నమెంట్ సొంతగా ఓటీటీ నిర్వహించాలని విజయ్ సేతుపతి కోరారు… ప్రస్తుతం అదే కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది… ఎంతోమంది విజయ్ సేతుపతి విన్నపాన్ని సమర్థిస్తూ ఉండడం గమనార్హం!… ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ సినిమా రంగాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ శాసిస్తున్నాయి… ఎంత టాప్ హీరో నటించిన సినిమా అయినా, ఎంత వెచ్చించి చిత్రాన్ని నిర్మించినా – ఓటీటీ వారు శాసించినట్టుగానే నిర్మాతలు ప్రవర్తించవలసి వస్తోంది… ఓటీటీ వారు రిలీజ్ చేయమన్నప్పుడే సినిమాలను రిలీజ్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి…
కోవిడ్ తరువాత ఓటీటీకి ఎనలేని క్రేజ్ లభించింది… అప్పట్లో చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు మంచి రేటు ఇచ్చి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కొనుగోలు చేసేవి… చిన్న సినిమాలకు ఓటీటీ అప్పట్లో ఓ కామధేనువులా కనిపించింది… రాను రాను పలు రూల్స్ పెట్టి, చిన్న సినిమాను చులకన చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్… క్రేజీ ప్రాజెక్ట్స్ కే భారీ మొత్తాలతో ఎరవేస్తున్నాయి ఓటీటీ సంస్థలు… ఈ నేపథ్యంలో రెండేళ్ళ క్రితం కేరళ ప్రభుత్వం మళయాళ సినిమా బాగు కోసం ‘సీస్పేస్’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది… ఇదే తీరున తమిళనాడు గవర్నమెంట్ కూడా సొంతగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తే చిన్న సినిమాలకు మేలు చేసినట్టవుతుందని విజయ్ సేతుపతి భావన…
గతంలో తమిళనాట ఎమ్జీఆర్, తెలుగునేలపై యన్టీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడూ సినిమా రంగం అభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టారు… అదే తీరున విజయ్ కూడా ప్రస్తుతం కోలీవుడ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తమిళ సినీజనం ఆశిస్తున్నారు… అందులో భాగంగానే ‘గవర్నమెంట్ ఓవర్ ద టాప్’ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు… అదే జరిగితే తప్పకుండా తమిళంలో రూపొందే ‘లో-బడ్జెట్ మూవీస్’కే కాకుండా ఇతర ప్రాంతీయ భాషా చితరాలకూ ఉపకారం జరుగుతుందని అంటున్నారు… మరి కోలీవుడ్ జనం కోరుకుంటున్నట్టు ‘గవర్నమెంట్ ఓటీటీ’కి విజయ్ శ్రీకారం చుడతారేమో చూడాలి…
Follow for more updates
