హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం, కాముని దహనం. ఈ పండుగ సందర్భంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డ్యాన్సులు చేస్తూ ఆద్యంతం సంబరాల్లో మునిగి తేలుతారు.
అయితే, ఓ గ్రామంలో యువకులు మాత్రం హోలీ రోజున వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకుని ఆభరణాలు, పువ్వులతో సింగారించుకుని.. ఆడవారి వేషధారణలో మారిపోతారు. వారు ఎందుకలా చేస్తారో తెలియాలంటే ఇది చూడాల్సిందే…కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో హోలీ రోజున అనాదిగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. హోలీ రోజున పురుషులు మహిళల వేషధారణలోకి మారతారు. చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని.. ఆభరణాలు సింగారించుకుంటారు. ఆ స్త్రీ వేషధారణతో రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం. పెళ్లి కాని అబ్బాయిలు వివాహం కోసం, నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం కోసం, అనారోగ్య సమస్యలు, కోరిన కోర్కెలు తీరాలంటే ఇలా హోలీ రోజున ఆలయంలో పూజిస్తే అవి నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు. తరాతరాల నుంచి తాము ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
Discussion about this post