సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ప్రతి ఏటా… దాదాపు అన్ని గ్రామాల్లో జరిగే పరిణామమే ఇది. కానీ సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఊరంతా విష జ్వరాలతోనే ఇబ్బంది పడుతోంది. ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల బారిన పడ్డారు. జ్వరాల బారిన పడ్డ ప్రజల సంఖ్య వందల్లో ఉండటంతో జిల్లా పరిషత్ పాఠశాల భవనాన్నే… ఆసుపత్రిగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు. విష జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తాడువాయి గ్రామ పరిస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
వర్షాకాలం మొదలు కాగానే… సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చూడండి తాడువాయి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలనే తాత్కాలిక వైద్య సేవలు అందించే శిబిరంగా మార్చారంటే ఈ గ్రామంలో ఎంతమంది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఒకరు కాదు… ఇద్దరు కాదు… ఊరు ఊరంతా వైరల్ జ్వరాలే. తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాల బారిన పడ్డ వారి సంఖ్య అధికంగా ఉండటంతో వైద్య సిబ్బంది గ్రామానికే వచ్చి పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో సేవలందిస్తున్నారు.
చూడండి పాఠశాల ప్రాంగణంలో వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్లినిక్ గా మారిన పాఠశాల ప్రాంగణం నుంచి జనరల్ ఆసుపత్రిగా మారిన తరగతి గదుల్లోకి వెళ్లి చూద్దాం… అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. గ్రామస్థుల నుంచి మంచాలు తెప్పించి రోగులకు బెడ్లుగా మార్చి వారికి… అక్కడే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. పాఠశాలలోని ప్రతి తరగతి గది ఇప్పుడు జ్వరాలతో ఇబ్బంది పడుతోన్న రోగులకు వైద్య సేవలు అందించే శిబిరంగా మారింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాలు ఇంతగా రావడానికి కారణమేమిటి? వాటిపై వైద్య సిబ్బంది ఏమంటున్నారు? ఈ జ్వరాలు ప్రాణాంతకమా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… రోగులకు పరీక్షలు నిర్వహిస్తోన్న వైద్య సిబ్బంది చెబుతోన్న ప్రకారం గ్రామంలో పారిశుద్య సమస్య ఎక్కువగా ఉంది. చాలా చోట్ల నీరు నిలువ ఉండటమే జ్వరాలు ప్రబలడానికి కారణమని వారు చెబుతున్నారు.
మరి తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాలు ప్రబలడానికి గ్రామంలో పారిశుద్య సమస్యే కారణమంటోన్న వైద్య సిబ్బంది మాటల్లో నిజమెంత? ఆ విషయం తెలుసుకునేందుకు మనం ఒక్కసారి గ్రామాన్ని చుట్టొద్దాం. చూడండి గ్రామంలో ఏ వాడకు వెళ్లినా వర్షపునీరు, మురుగునీరు నిలిచి ఉండటం కనిపిస్తోంది. మరిన్ని వాడలు తిరిగొద్దాం పదండి… ఇవి చూడండి అసలు ఇవి రోడ్లేనా? గుంతలు ఏర్పడి వర్షపునీరు నిలువ ఉంది. భూమి కూడా గమనించండి… ఎంతగా పాకురుపట్టి ఉందో…? పారిశుద్య సమస్య ఇంత అద్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో గ్రామస్థులకు జ్వరాలు రాకుండా… ఆరోగ్యం ఎలా బాగుంటుంది?
గ్రామంలో ఏ వాడకు వెళ్లినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. రోడ్లన్నీ గుంతలు ఏర్పడి వాటిల్లో వర్షపునీరు చేరి దోమలు వృద్ది చెందుతున్నాయి. ఇప్పుడు ఈ గ్రామంలో రెండు రోజుల వ్యవధిలోనే ఆరుగురికి డెంగ్యూ వ్యాధి నిర్థారణ అయింది. గ్రామమంతా చిత్తడిగా ఉంది. ప్రత్యేక అధికారుల పాలన పడకేసినట్లే కనిపిస్తోంది. పరిస్థితి దిగజారడంతో దిద్దుబాటు చర్యల కోసమన్నట్లు పక్కూర్ల నుంచి సిబ్బంది తెప్పించి మరీ పారిశుద్య పనులు చేయిస్తున్నారు. ఇవన్ని మొక్కుబడి కార్యక్రమాలుగానే కనిపిస్తున్నాయి. అసలు వర్షాకాలమంతా ముందుంది. ఇప్పటికి పెద్దగా వర్షాలు కురిసిన పరిస్థితి కూడా లేదు. మరి ముందున్న వర్షాకాలాన్ని అధికారులు సమర్థంగా ఎదుర్కొంటారా? అనే అనుమానం కలుగుతోంది.
జిల్లా అధికార యంత్రాంగం తాడువాయి గ్రామంలో నెలకొన్న పరిస్థితిపై చాలా సీరియస్ గా ఆలోచన చేస్తే గానీ పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు. వైరల్ జ్వరాలకు వైద్యం చేయడమే కాకుండా… గ్రామంలో ఆ సమస్యకు కారణమౌతోన్న పారిశుద్య సమస్యపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Discussion about this post