పది రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి…ఇప్పుడు శవమై వస్తున్నాడంటూ శ్రీహరిపురానికి చెందిన పట్నాల సురేశ్ భార్య భార్గవి కన్నీరుమున్నీరుగా విలపించారు. మెరైన్ ఇంజనీర్ అయిన సురేశ్ ఒమన్ తీరంలో నౌకపై అమెరికా చేసిన దాడిలో మృతిచెందారు.

ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా డ్రోన్ దాడి చేసిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారనే వార్త టీవీల్లో చూసి…అయ్యో పాపం అనుకున్నానని, తన భర్తే అందులో ఉన్నారనుకోలేదని భార్గవి రోదించారు. తమకు నయన్, జతిన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. తమ పిల్లలతో పాటు తన అక్క పిల్లలను కూడా తామే చూసుకుంటున్నామన్నారు. తన అక్క, బావ చనిపోవడంతో వారి పిల్లలు హరిప్రియ, హేమసాయిప్రియలను కూడా తన భర్తే చూసుకుంటున్నాడని భార్గవి తెలిపారు.
తాము మరికొద్ది రోజుల్లో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉందన్నారు. ఆ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తమ కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అలాంటి వేళ.. ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తండ్రి మరణాన్ని పిల్లలిద్దరు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. సురేశ్ పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదని భార్య భార్గవి గుర్తు చేసుకున్నారు. ఆయన తన అభిరుచికి తగ్గట్లు మెరైన్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
రెండు దశాబ్దాలుగా ఆయన ఈ విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఆయన ఒకే కంపెనీలో చేస్తున్నారని చెప్పారు. సురేశ్‌కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి కూడా ఉందన్నారు. సెలవు పెట్టి ఇంటికి వచ్చేందుకు సురేశ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
Follow for more updates
