దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయని కేంద్ర మత్స్య, పశుసంవర్దక, డెయిరీ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. ఎ.డి.ఐ.పి. పథకం కింద విశాఖ డి.ఎల్.బి. గ్రౌండ్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహారావు, విభిన్న ప్రతిభావంతులు-హిజ్రాలు-వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఎండీ కుమార్ రాజా, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ లతో కలిసి 1,589 మంది దివ్యాంగులకు 2.25 కోట్ల రూపాయల విలువైన 2,925 పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ ఇంతమంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయటం శుభపరిణామమని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విజన్, సున్నిత మనస్తత్వం కారణంగానే దివ్యాంగులకు ఈ స్థాయిలో మంచి జరుగుతోందని వివరించారు. నరేంద్ర మోదీ అడగకుండానే పేదలకు అన్నీ ఇస్తున్నారని చెప్పారు.
దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయటం చాలా మంచి కార్యక్రమమని రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 30 లక్షల మందికి ఉపకరణాలను పంపిణీ చేసిందని వివరించారు. అలాగే వృద్ధుల కోసం ప్రవేశ పెట్టిన ప్రత్యేక పథకాన్ని విశాఖపట్నానికి వర్తింపజేశారని వెల్లడించారు.
Discussion about this post