పక్కనే పెద్ద డ్యామ్ ఉంది… కానీ పంటలకు నీళ్లు అందివ్వడం లేదు… నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు వర్షాలు కురువక… డ్యాం నుంచి సాగునీరు అందక చెత్తికి చేతులు పెడుతున్నారు. గిట్టుబాటు కాదు… కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదంటున్న సాగర్ ఆయకట్టు రైతులు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు ఏనాడో అడుగంటింది. ఎగువ ప్రాంతాల్లో తిరిగి వర్షాలు కురిస్తేనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద వస్తుంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో ఇప్పటికీ వర్షాలు కురవడం లేదు. జూన్ మాసం గడిచి పోయింది. అయినా ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. వర్షంపై ఆదారపడ్డ సాగర్ ఆయకట్టు రైతులు ఎప్పుడు వర్షాలు కురుస్తాయా? అని చెత్తిన చేతులు వేసుకొని ఆకాశం వైపు మేఘాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజు వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక్కడి సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఎలా తయారయిందంటే… పక్కనే ప్రాజెక్టు ఉన్నప్పటికీ పంట పొలాలకు నీళ్లు లభించని దుస్థితి. సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకుందామనుకున్న రైతులకు కూడా నిరాశే ఎదురవుతుంది. బోయించిన బోర్లు ఫెయిలై నీళ్లు పడటం లేదని సాగర్ ఆయకట్టు రైతులు చెబుతున్నారు. బోర్ల కోసం ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా తాము కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నారు. సాగర్ ఆయకట్టు రైతులకు మూడేళ్లుగా సాగునీరు లభించడం లేదంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడక పోవడంతో ఏ పంట వేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేక పోతున్నారు అక్కడి రైతులు.
ఇక నాగార్జున సాగర్ డ్యామ్ విషయానికొస్తే… సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు. కాగా ప్రస్తుతం డ్యామ్ లో నీటిమట్టం 504 అడుగులకు పడిపోయి డేంజర్ బేల్స్ మోగిస్తుంది. ఒకవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు… మరో వైపు మండుతున్న ఎండలతో ప్రాజెక్టులో నీటిమట్టం రోజు రోజుకు పడిపోతుంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీరు, సాగు నీరు అందించిన వరప్రదాయని ప్రస్తుతం వెలవెలపోతోంది.
వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1956లో నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా అడుగంటిపొయింది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజ్ కి నీటి నిల్వలు పడిపోయాయి. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి గండం పొంచి ఉంది. శ్రీశైలం నుండి నీరు వస్తే తప్ప హైదరాబాద్ దప్పిక తీరే మార్గం కనిపించడం లేదు. భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలకు నిత్యం 800 క్యూసెక్కుల నీటిని పుట్టంగండి ఏఎమ్మార్పీ ద్వారా పంప్ చేస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు తాండవిస్తోంది. గత ఏడాది నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగానికి క్రాప్ హాలిడే ప్రకటించాడంతో రైతాంగం దివాలా తీసింది. ఈ నేపథ్యంలో 200 క్యూసెక్కుల నీరు తగ్గుముఖం పడుతుంది. వాస్తవానికి 510 అడుగుల నీటిమట్టం వరకే నీటిని పంపు చేసుకోవడానికి అవకాశం ఉండగా జలాశయ మోటార్లను అమర్చి అప్రోచ్ ఛానల్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో కొంత దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ ప్రాజెక్టులో నీటి లభ్యత ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పటికే వర్షాలతో పచ్చటి పచ్చిక బయళ్లతో కళకళలాడాల్సిన పంట చేలు బీల్లుగా మారాయి.
వర్షాకాలం ప్రారంభమై నెల నెలలు గడుస్తున్నప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవక పోవడం… శ్రీశైలం ప్రాజెక్ట్ తో పాటు ఎగువన ఉన్న జలాశయాలు కూడా వెలవెల బోతున్నాయి. వర్షాలు సమృద్దిగా కురిసి ఎగువ జలాశయాలు నిండితే తప్ప శ్రీశైలం, సాగర్ జలాశయాల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. జూలై, ఆగస్టు మాసాలు ముగిస్తే గానీ శ్రీశైలంలోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సాగర్ జలాశయంపై ఆధారపడిన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
Discussion about this post