ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల DROP – OUT లను తగ్గించడానికి ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలు భేష్ గా ఉన్నా, అమలు మాత్రం లోప భూయిష్టంగా ఉంటోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి చిన్నారుల ఆకలి తీరుస్తున్నా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఓవైపు వడ్డీలు.. మరోవైపు భోజన నిర్వహణ భారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో మధ్యాహ్న భోజన కార్మికులు బతుకులు వెళ్లదీస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్న వంట కార్మికులకు మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం కూడా అందడం లేదని వంట కార్మికురాలు లక్ష్మీ తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ సరిపోవడంలేదని వారు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో వంట కార్మికులకు ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి కోరారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంకాలం స్నాక్స్ అందిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని తిరుపతిరెడ్డి తెలిపారు. వంట చేసేవారికి బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గంలో 195 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 116 ప్రాథమిక, 26 ప్రాథమికోన్నత, 53 ఉన్నత పాఠశా లలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 10,700 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు 200 మందికి పైగా నిర్వాహకులు ఉన్నారు.
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం బియ్యం మాత్రమే అందిస్తోంది. మిగతా నిత్యావసర సరుకులను నిర్వాహకులే కొనుగోలు చేస్తున్నారు. 100మంది ఉన్న పాఠశాలల్లో రోజుకు రూ.750 నుంచి రూ1000 వరకు మధ్యాహ్న భోజన కార్మికులపై భారం పడుతోందని వంట కార్మికులు తెలిపారు. నెలలో కనీసం రూ.40వేల వరకు ఖర్చును భరించాల్సి వస్తోందని వారు తెలిపారు.
Discussion about this post