ట్రక్కు డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల పక్కన 1000 విశ్రాంతి భవనాలను నిర్మించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు
ఢిల్లీలో శుక్రవారం జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 లో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఈ భవనాలను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నట్లు ప్రధాని వివరించారు. ఈ విశ్రాంతి భవనాల్లో ఆహారం, నీరు, వాష్‌రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో పాటు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.
ఇవి లక్షలాది మంది ట్రక్కు డ్రైవర్లకు ఉపయోగపడతాయని వెల్లడించారు. జాతీయ రహదారులపై వేలాది కిలోమీటర్ల దూరం ట్రక్కులను నడిపించే డ్రైవర్లుకు సరైన విశ్రాంతి, నిద్ర ఉండటం లేదని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రధాని వివరించారు.
ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ రహదారుల పక్కన విశ్రాంతి భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలి దశలో 1000 భవనాలను నిర్మిస్తామని. తర్వాత మరిన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో వాహన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. 2014కు ముందు పది సంవత్సరాల కాలంలో 12 కోట్ల వాహనాలు విక్రయమవగా తర్వాత పదేళ్ల కాలంలో 21 కోట్ల వాహన కొనుగోళ్లు జరిగాయని వెల్లడించారు.