ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 14 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ జీవితమంతా జైల్లోనే గడపాల్సి వచ్చేలా ఉంది. విదేశీ బహుమతుల (తోషా ఖానా) విక్రయం కేసులో ఇమ్రాన్ కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్‌ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది.

విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను వారు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తేలడంతో కోర్టు 14 ఏళ్ల  కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ మాజీ ప్రధానిపై అనర్హత వేటు కూడా వేసింది. ఒక్కరికి 78 కోట్ల రూపాయల మేర జరిమానా కూడా విధించింది.

ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పులు వరసగా వెలువడటం గమనార్హం. 

అధికార పత్రాల లీక్ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

తోషా ఖానా కేసు విషయానికి వస్తే ..విదేశాలకు ప్రధాని అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. ఈ బహుమతులు ప్రభుత్వానికే చెందుతాయి.

కానీ ఇమ్రాన్‌ ఖాన్ వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్  జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తోషా ఖానా కేసు విచారణ అక్కడే జరిగింది. కోర్టు తీర్పు వెలువడ్డాక ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ జైలుకు వచ్చి లొంగిపోయారు.