బ్లాక్ బస్టర్‌గా ‘హనుమాన్’ చిత్రం

సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ చిత్రం 92 ఏళ్ల  టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. సెన్సేషనల్   డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది.

ఇప్పటికే 278 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన తొలి సినిమా అయిన ఈ ఫాంటసీ అడ్వెంచర్..

హిందీతో సహా అన్ని భాషలలో అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ‘హనుమాన్’ చిత్రం స్ట్రెయిట్ హిందీ సినిమాలా  రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబడుతోంది. టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి వచ్చిన సినిమాల రికార్డ్‌లన్నింటిని బ్రేక్ చేసి అదిరిపోయే వసూళ్లతో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసినట్లు ప్రకటిస్తూ నిర్మాతలు ఓ పోస్టర్ ను  విడుదల చేశారు.

ఈ పోస్టర్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తికాగా మరికొన్ని వారాల పాటు విజయవంతంగా నడుస్తుందని తాజా రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.

 అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ తేదీని వాయిదా వేశారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తేజ సజ్జాతో  అమృత అయ్యర్ జంటగా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు