తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులు చాలీ చాలని సౌకర్యాలతో అల్లాడుతున్నాయి. కొత్త వైద్యకళాశాలలను హడావుడిగా ప్రారంభించిన గత ప్రభుత్వం తర్వాత వాటిని గాలికి వదిలేసింది. ల్యాబరేటరీలు, లెక్చర్ హాల్స్, వసతి గృహాలు, గ్రంథాలయాలను అరకొరగా ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లను నియమించడానికి అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని పోస్టులు 2021 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు సరైన మౌలిక వసతులు కల్పించకుండానే హడావుడిగా నూతన మెడికల్ కళాశాలలను ప్రారంభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాల లేమి, వైద్య విద్యార్థుల దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతించింది.
అధ్యాపకుల నియామకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడం హర్షణీయమే. కానీ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ఎప్పుడు దృష్టి సారిస్తుందనేదానిపై స్పష్టత లేదు. కొత్త కళాశాలలు ఇప్పటికీ తాత్కాలిక భవనాలలోనే కొనసాగుతున్నాయి. ల్యాబరేటరీలు, లెక్చర్ హాల్స్, వసతి గృహాలు, గ్రంధాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు.
గత ప్రభుత్వం అనాలోచితంగా హుటాహుటిన తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి అమలు చేసిన మాట విదితమే, కానీ కొత్త కళాశాలల ఏర్పాటు.. విద్యార్థులకు , వారి తల్లిదండ్రులకు ఆనందం కలిగించినప్పటికి వసతులు సరిగా లేకపోవటం, అధ్యాపకుల కొరత, పాఠ్య పుస్తకాల కొరత తది తర విషయాలు ఇబ్బందిగా మారాయి .
Discussion about this post