ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ్ ఆలయం. సార్వత్రిక ఎన్నికల సమయంలో సరికొత్త చర్చకు కేంద్ర బిందువుగా మారింది.. జగన్నాథ్ ఆలయంలో రత్నభండార్ తాళం చెవులను ఎన్నికల ప్రధాన అస్త్రంగా బీజేపీ మలుచుకుంది. అక్కడ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఒడిశాలో పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పూజలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అంతటితో ఊరుకోకుండా… అత్యంత పురాతన చరిత్ర ఉన్న రత్నభండార్ తాళం చెవులు ఏమయ్యాయి? అంటూ డౌట్ లేవనెత్తారు. అక్కడ నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో రత్నభండార్ అంశం నేషనల్ పొలిటికల్ డిస్కషన్స్ లో ఇప్పుడు భాగమైంది. భక్తులను కాపాడటానికి దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడి సంపదను కాపాడటానికి ఎవరున్నారు? ఆ దేవుడే కాపాడుకోవాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారం.
అప్పట్లో కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల వ్యవహారం దేశంలో పెద్ద చర్చే లేపింది. నెలల తరబడి పద్మనాభుడి సంపదపై దేశ ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు రత్నభండార్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ప్రసిద్దిగాంచిన జగన్నాధ ఆలయంలోని రత్నభండార్ తాళాలు కనిపించకుండా పోయి ఆరేళ్లు అయింది.
రత్నభాండార్ తాళాలు తమిళనాడుకు వెళ్లడంతో ..విచారణ కమిషన్ నివేదికను ఆరేళ్లుగా అటకెక్కించారని మోడీ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ నివేదికను బహిరంగ పరుస్తామని హామీ ఇచ్చారు. ఖజానాకు డూప్లికేట్ తాళాలను కనుగొన్నామని ప్రభుత్వం చెబుతుంటే ఒరిజినల్ తాళాలు లేకుండా డూప్లికేట్ తాళాలు ఎలా వచ్చాయని మోడీ ప్రశ్నించారు. ఆపై బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు.
2018 ఏప్రిల్ 4న ప్రభుత్వం రత్న బండార్ ను పరిశీలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యింది. 16 మంది సభ్యులున్న బృందం ఆలయ నిర్మాణ స్థితిని పరిశీలించేందుకు హైకోర్టు ఆదేశం మేరకు వెళ్లగా.. రత్నభండార్ లోని గ్రిల్స్ బయటి తాళాలు కనిపించలేదు. దీనిపై ముఖ్యమంత్రి న్యాయవిచారణకు ఆదేశించగా… 2018 నవంబరులో కమిషన్ 344 పేజీల నివేదికను సమర్పించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను బహిరంగ పరచలేదు. న్యాయవిచారణకు ఆదేశించిన రోజునే అప్పటి పూరీ జిల్లా కలెక్టర్ రహస్యంగా పంపిన కవరును కనుక్కోగా దానిపై అంతర్గత రత్న భండార్ నకీలీ తాళాలు అని రాసి ఉండటంతో వివాదం మరింత ముదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 15న కటక్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ… ఖజానా తాళాలపై న్యాయ కమిషన్ నివేదికను బిజెపి ప్రభుత్వం బహిరంగపరుస్తుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ, బీజేపీ విజయం సాధించిన తర్వాత, రత్నా భండార్‌లో కనబడని తాళాలపై బీజేపీ దర్యాప్తు ప్రారంభించి, తాళాలను కొనుగోలు చేస్తుందని జేపీ నడ్డా తెలిపారు. తమిళనాడుకు చెందిన పాండ్యన్ నగలుంచిన గది తాళాలను దాచిపెట్టారని ఆరోపిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బీజేడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. షా, నడ్డా వంటి బీజేపీ నేతలు కూడా ఆలయ సింహద్వారం గుండా ప్రవేశించే భక్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆలయ నాలుగు ద్వారాలను తెరుస్తామని హామీ ఇచ్చారు. సింగిల్ గేటు ప్రవేశం వల్ల ఎండ వేడిమికి గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఇబ్బందిగా మారిందన్నారు.
ఈ ఆరోపణలపై బీజేడీ అధికారికంగా స్పందించలేదు. ఒరిస్సా హైకోర్టు తీర్పును అనుసరించి రత్నా భండార్ జాబితాను పర్యవేక్షించడానికి ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినందున పార్టీ ఆరోపణలను పట్టించుకోదని సీనియర్ బిజెడి నాయకుడు చెప్పారు. ఈ సమస్య ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని మాకు తెలుసు. బీజేపీ నేతలు, ప్రధాని మోడీలను ఆరోపణలు చేయనివ్వండని ఒక BJD నాయకుడు అన్నాడు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సహా చాలా మంది రాజకీయ నాయకులు జగన్నాథుని ఆశీస్సులు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. BJD ఈ ఏడాది ప్రారంభంలో జగన్నాథ పరిక్రమ ప్రాజెక్ట్ లో భాగంగా భక్తుల కోసం ఆలయ సరిహద్దు గోడ చుట్టూ కారిడార్ సృష్టించి… రాజకీయ లబ్దిని పొందేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ.. భగవంతుని నిధి సురక్షితంగా ఉందా? లేదా అనే దాని గురించి తెలుసుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని బీజేపీ నాయకుడు భర్తృహరి మహతాబ్ అన్నారు.
గత శతాబ్దంలో జగన్నాధుని ఆలయంలోని ఖజానాను నాలుగు సార్లు అనగా…1905, 1926, 1979, 1984 లలో మాత్రమే లెక్కించారు. రత్న భండార్‌లో రెండు గదులు ఉండగా… వాటిని భితర్ భండార్ అనగా అంతర్గత ఖజానా, బాహార్ ట్రెజరీ బహిర్గత ఖజానా అని పిలుస్తారు. శ్రీ జగన్నాథ ఆలయ 1960లోని నియమ, నిబంధనల ప్రకారం అనుగుణంగా, రత్న భండార్‌లోని ఆభరణాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి. భితర్ భండార్‌లో ఉంచబడిన నగలను ఎప్పుడూ వాడని నగలు అవి కేటగిరి 1 లోకి వస్తాయి. పండుగలకు వాడే ఆభరణాలు కేటగిరి 2 లోకి వస్తాయి. రోజువారీ నగలను కేటగిరి 3లో ఉంచారు. జగన్నాథ దేవాలయ 1960 నియమ నిబంధనల మేరకు రత్న భండార్‌లోని నగలను ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కించి, తాళాలు కలిగిన అధికారి ఆడిట్ చేయించాలి. 1978 మే 13, జూలై 23 మధ్య చివరిసారిగా ఖజానా ఆడిట్ చేయబడింది. ఆలయ అధికారిక చరిత్ర అయిన మాదాల పంజి ప్రకారం, రాజు అనంగభీమ దేవ ముక్కోటి దేవతల ఆభరణాలను సిద్ధం చేయడానికి దాదాపు 1.5 క్వింటాళ్ల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. రత్న భండార్‌లో సుమారు 149.47 కిలోల బంగారు ఆభరణాలు, 198.79 కిలోల వెండి ఆభరణాలు, పాత్రలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు గత నెలలో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపారు. జగన్నాధ దేవాలయం 12వ శతాబ్దానికి చెందింది. ఉపయోగించని నగలన్నీ రత్నభండాగార్ లో ఉంచుతారు. దీని తాళాలు తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఒక తాళం శ్రీ జగన్నాధ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ వద్ద ఉండగా…మరొకటి పట్టా జోషి మహాపాత్ర వద్ద ఉంటుంది. వీరు మాత్రమే తాళాలకు, దేవాలయ విషయాలకు బాధ్యత వహిస్తారు.
Discussion about this post